పవన్ కళ్యాణ్ కళ్లలో భయం కనిపించింది .. హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు
హైపర్ ఆది మాటల్లోనే పంచ్‌లు ఉంటాయి. ఆ పంచ్‌లకు చప్పట్లూ అదే రేంజ్‌లో ఉంటాయి. జబర్దస్త్‌లో అదిరే అభి టీమ్‌లో ఓ చిన్న కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆది తర్వాత తన టాలెంట్‌తో టీమ్ లీడర్‌గా ఎదిగాడు. విసుగు, విరామం లేకుండా గంటల తరబడి ఆగకుండా నవ్వించగల సత్తా ఆది సొంతం.
హైపర్ ఆది కేవలం తన స్కిట్ కోసమే ప్రేక్షకులు జబర్దస్త్ ఎపిసోడ్ చూసేవాళ్లంటే అతిశయోక్తి కాదు. యూట్యూబ్‌లోనూ మిలియన్లకొద్దీ వ్యూలతో సరికొత్త రికార్డులను సృష్టించాడు ఆది. జబర్దస్త్‌లో సత్తా చాటిన హైపర్ ఆది సినిమాల్లోనూ అదరగొడుతున్నాడు. వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో స్థానం సంపాదిస్తున్నాడు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, ఇతర మూవీ ఫంక్షన్‌లలో ఆది స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తూ ఉంటాడు.

పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన హైపర్ ఆది.. ఆయనపై ఎప్పుడూ అభిమానం చాటుకుంటూ ఉంటారు. జనసేనలో చేరిన ఆది... పార్టీకి గట్టి వాయిస్‌గా మారారు. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలోనే మకాం వేసిన ఆది.. తన సహచరులు సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనులతో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్ధించారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం సాధించిన సందర్భంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ .. సినీ, రాజకీయ, మీడియా వర్గాలకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానిప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా అని వ్యాఖ్యానించారు.

కూటమి అనే సినిమా 164 రోజులు ఆడిందని.. ఏ బిడ్డ అయినా తన తొలి సంపాదనతో తల్లికి చీర కొనిపెట్టినప్పుడు, బైక్‌పై తండ్రిని కూర్చోబెట్టి తీసుకెళ్లినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో పవన్ గెలిచినప్పుడు ప్రతి జన సైనికుడి కళ్లలోనూ అంతే ఆనందాన్ని చూశానని ఆది చెప్పారు.
రామాయణంలో లంకా దహనం తర్వాత హనుమంతుడు శ్రీరామచంద్రుడి పాదాలు పట్టుకున్నట్లుగా.. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయాన్ని తీసుకెళ్లి అన్నయ్య చిరంజీవి కాళ్ల దగ్గర పెట్టారని ప్రశంసించారు. ఇంతకుమించిన ఎమోషనల్ మూవ్‌మెంట్ మరొకటి ఉండదని హైపర్ ఆది అన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేడంటూ పవన్‌పై విమర్శలు చేసేవారని, కట్ చేస్తే ఇప్పుడు 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్‌సభ స్థానాల్లో బరిలో నిలిచి.. పోటీ చేసిన అన్ని చోట్లా గెలిచి ఏపీ డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చొన్నారని ఆది ప్రశంసించారు.
రాజకీయం అనేది బతికున్నంత కాలం పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తూనే ఉంటుందన్నారు. గెలిచిన వాళ్లలో గర్వం ఉండటం కామన్.. కానీ పవన్ కళ్లలో మాత్రం తాను భయాన్ని చూశానని ఆది చెప్పారు. జనం 100 శాతం స్ట్రైక్ రేటుతో గెలిపించినట్లే.. నూటికి నూరు శాతం సక్సెస్‌ఫుల్‌గా బాధ్యతను నిర్వర్తించాలనే భయం పవన్ కళ్యాణ్ కళ్లలో చూశానని ఆది తెలిపారు. కానీ ఆయన చేసి చూపిస్తారని.. అలాంటి నాయకుడు దొరకడం మనందరి అదృష్టమని ఆది చెప్పారు. ప్రస్తుతం హైపర్ ఆది వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











