నా వెనుకాలే కార్లతో , ఇంటికెళ్తానా అనుకున్నా .. కిరాక్ ఆర్పీ హాట్ కామెంట్స్
జబర్దస్త్ ద్వారా పాపులరైన కిరాక్ ఆర్పీ.. ఆ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లోనూ అవకాశాల దక్కించుకున్నారు. తన ప్రాంతంలో ఫేమస్ వంటకాలే పెట్టుబడిగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఔట్‌లెట్ ద్వారా వ్యాపారవేత్తగానూ మారారు. అలాంటిది బిజినెస్‌ను పక్కనబెట్టి అనూహ్యంగా రాజకీయాల్లోకి దిగారు ఆర్పీ. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి వీరాభిమాని అయిన కిరాక్ ఆర్పీ 2024 ఎన్నికల ముందు నుంచి ఆ పార్టీకి మద్ధతుగా మాట్లాడుతున్నారు. టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి తరపున ప్రచారం కూడా చేశారు. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చే విమర్శలకు తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేవారు ఆర్పీ.
ఫలితాలు విడుదలై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన తన దూకుడు మరింత పెంచారు. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి రోజాలపై ఆయన వేసే సెటైర్లు వైరల్ అవుతున్నాయి. గతంలో వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన సెలబ్రెటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామిని కూడా ఆర్పీ వదల్లేదు. ఆయనో పెద్ద డెకాయిట్ అని, ఆడవాళ్లు ఎక్కడుంటే అక్కడ ఉంటాడని ఆరోపించారు. బ్రాహ్మణులు అనేవారు నియమ నిష్టలతో , పవిత్రంగా ఉంటారని కానీ వేణుస్వామిలో అలాంటి లక్షణాలేవి ఉండవని ఆర్పీ దుయ్యబట్టారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలుస్తాడని వేణుస్వామి జోస్యం చెప్పారని వైసీపీ పెద్దలు ఏం చెబితే అది చేస్తున్నాడని కిరాక్ ఆర్పీ మండిపడ్డారు. వేణుస్వామి చెప్పే దొంగ వ్యవహారాలను నమ్మి హీరోయిన్లు మోసపోవద్దని.. ఇలాంటివారిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కిరాక్ ఆర్పీ డిమాండ్ చేశారు. పవన్‌కు వ్యతిరేకంగా వైసీపీకి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు. దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించకపోయినా నేను స్పందిస్తానని చెప్పుకొచ్చారు.
అయితే ఆర్పీ వంటి సాదాసీదా వ్యక్తి పెద్దవాళ్లను నానామాటలు అంటే వాళ్లు, వారి మనుషులు ఊరుకుంటారా అనే డౌట్ రావొచ్చు. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆ పార్టీ వీరాభిమానులు కొందరు తనపై కక్షగట్టారని.. తన ఔట్‌లెట్లపై దాడులు జరిగాయని, ఫ్రాంఛైజీల విస్తరణను అడ్డుకున్నారని ఆర్పీ ఆరోపించారు. అర్ధరాత్రుళ్లు తన ఇంటి తలుపులను కొట్టి భయభ్రాంతులకు గురిచేసేవారని , సోషల్ మీడియాలోనూ తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా రాశారని ఆయన పలుమార్లు తెలిపారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామ కృష్ణంరాజును కలిసి తన కారులో గచ్చిబౌలి మీదుగా వస్తుండగా.. కొందరు కార్లలో తనను ఫాలో అయ్యారని చెప్పారు. వీళ్లెవరో అందరికీ తెలుసు.. నా డై హార్డ్ ఫ్యాన్స్ అని, నన్ను నేను ఎలా కాపాడుకోవాలా అని భయపడ్డానని ఆర్పీ పేర్కొన్నారు. లోకేషన్ చేసుకుంటూ వస్తుండగా చిరంజీవి గారి కటౌట్ కనిపించగానే.. ఎంతో ధైర్యం వచ్చిందన్నారు. మెగా ఫ్యాన్స్ గుర్తొచ్చి భయపడ్డారో ఏమో కానీ వెనుక ఒక్క కారు కూడా కనిపించలేదన్నారు. ప్రస్తుతం కిరాక్ ఆర్పీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయనను వెంటాడిన కార్లు ఎవరివి, వాళ్లు ఎవరి మనుషులు అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











