'KCR కోసం నా ఇల్లు, నా భార్య కారు అమ్మేసా.. చివరకు ఏం జరిగిందంటే?'
దాదాపు దశాబ్ధానికి పైగా తెలుగు వారిని అలరిస్తోంది జబర్దస్త్. ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ షో.. కామెడీ కేటగిరీలో నేటికీ నెంబర్‌వన్‌గా దూసుకెళ్తోంది. దీనిని కాపీ కొట్టి పలు ఛానెల్స్‌లో ఇదే తరహాలో కార్యక్రమాలు వచ్చినా జబర్దస్త్‌ను అవీ బీట్ చేయలేకపోయాయి. నేటికీ భారీ టీఆర్పీలతో జబర్దస్త్ దూసుకెళ్తోంది. ఈ షో ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు పరిచయమయ్యారు.
టాలెంట్ ఉండి దానిని ఎలా నిరూపించుకోవాలో తెలియని ఎంతో మందికి బబర్దస్త్ ఓ ఫ్లాట్‌ఫాంలా మారింది. ఈ కార్యక్రమం ద్వారా ధనరాజ్, చమ్మక్ చంద్ర, షకలక శంకర్, వేణు , సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను వంటి వారు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని హీరోలుగా, దర్శకులుగా నటించారు.. ఇంకా నటిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరారు రాకింగ్ రాకేష్.

తొలుత కొన్ని టీమ్‌లలో మెంబర్‌గా పనిచేసిన రాకింగ్ రాకేష్ తన టాలెంట్‌తో టీమ్ లీడర్‌గా ఎదిగాడు. చిన్నారులతో కూడా స్కిట్స్ చేయించి శెభాష్ అనిపించుకున్నాడు. పిల్లలతో పండించిన కామెడీ చాలా కాలం పాటు వర్కవుట్ అయ్యిది. ఎలాంటి ట్రోల్స్ , విమర్శలు లేకుండా క్లీన్‌గా స్కిట్స్ చేస్తూ విమర్శకుల ప్రశంసలు పొందారు రాకేష్. ఈ క్రమంలోనే జోర్దార్ సుజాతతో జబర్దస్త్ వేదికపై పరిచయమై, ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. తమ ప్రేమ విషయాన్ని జబర్దస్త్ వేదికపైనే ప్రకటించి సంచలనం సృష్టించింది ఈ జంట. గతేడాది ఫిబ్రవరి 24న తిరుమల శ్రీవారి సన్నిధిలో రాకేష్ - సుజాతలు పెళ్లిపీటలెక్కారు. ఇటీవల సుజాత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
ఇదిలాఉండగా.. జబర్దస్త్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ తన తోటి కమెడియన్ల మాదిరిగానే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అదే కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్). ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు రాకేష్. గరుడవేగ లాంటి సినిమాలకు డీవోపీగా పనిచేసిన అంజి ఈ సినిమాకు డైరెక్టర్. తెలంగాణలోని ఓ తండా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సీనియర్ నటులు తనికెళ్ల భరణి, కృష్ణ భగవాన్‌తో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు ధనరాజ్, తాగుబోతు రమేశ్, రచ్చరవి, రైజింగ్ రాజు, ప్రవీణ్, సన్నీ, జోర్దార్ సుజాత తదితరులకు కూడా అవకాశం కల్పించారు రాకేష్.

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న కేసీఆర్ మూవీకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశాడు రాకేష్. దీనిలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తను ఈ సినిమా కోసం ఎదుర్కొన్న కష్టాలను పంచుకున్నాడు. సినిమా కోసం స్టెప్ తీసుకోగానే నీకు మేం ఉన్నామని చెప్పినవాళ్లు.. మధ్యలోనే హ్యాండిచ్చి వెళ్లిపోయారని రాకేష్ చెప్పారు. ఓ పొలిటికల్ పార్టీ వల్ల లబ్ధిపొందినట్లుగా తనపై ఆరోపణలు వచ్చాయని.. కానీ తనకు అలాంటి అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
సినిమా తీయాలంటే డబ్బే అవసరం లేదని.. మా అమ్మకి ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టించి ఇచ్చానని, దానినే ఈ సినిమా కోసం తాను తాకట్టు పెట్టానని రాకేష్ తెలిపారు. ఇందుకు సంబంధించిన తాకట్టు పత్రాలను రాకేష్ ఇదే ఇంటర్వ్యూలో చూపించారు. ఈ విషయం అమ్మకి కూడా చెప్పలేదని , తెలిసిన తర్వాత ఆమె సైతం ఏందుకు , ఏంటీ అని అడగలేదని రాకేష్ చెప్పారు. తన భార్య సుజాత తన కారును కూడా అమ్మేస్తానని నన్ను ప్రోత్సహించిందని .. ఇందుకు ఆమెకు థ్యాంక్స్ అని రాకేష్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











