‘డొనాల్డ్ ట్రంప్ కాదు.. మహాత్ముడు పుట్టిన దేశం ఇది.. జన నాయగన్ సెన్సార్‌పై..’
ఇళయ దళపతి విజయ్ నటించిన జన నాయగన్ చిత్రం సెన్సార్ కోరల్లో చిక్కుకొని విడుదల వాయిదా పడటం సినీ దేశ పరిశ్రమలో అత్యంత వివాదాస్పదంగా మారింది. రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌ను ఇబ్బందులపాలు చేయడానికే ఈ సినిమాను అడ్డుకొన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాను విడుదల చేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని నిర్మాణ సంస్థ కేవీఎన్ నిర్వాహకులు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. అయినా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో సానుకూలత రాకపోవడం మరింత వివాదాస్పదంగా మారింది. అయితే ఈ సినిమాపై సెన్సార్ అనుసరిస్తున్న తీరుపై ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఘాటుగా స్పందించారు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించకపోవడం వెనుక వివాదం ఏమిటి? పీసీ శ్రీరాం చేసిన కామెంట్స్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..
తెలుగులో ఘన విజయం సాధించిన భగవంత్ కేసరి చిత్రాన్ని ఆధారంగా చూసుకొని జన నాయగన్ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాను కన్నడలో భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు. ఈ సినిమాను జనవరి 9 తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని అధికారికంగా డేట్ ప్రకటించారు. అయితే సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయకపోవడం వల్ల ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు.

డిసెంబర్ 19వ తేదీన ఈ సినిమాను సెన్సార్ అధికారులు వీక్షించారు. డిసెంబర్ 22న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు ఉన్నాయని చిత్ర యూనిట్‌కు సెన్సార్ కమిటీ తెలియజేసింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు అధికారులు కొన్ని కట్స్ సూచించారు. దాదాపు 24 పైగా కట్స్ సూచించడంతో వాటికి మార్పులు చేసి చిత్ర యూనిట్ తిరిగి సెన్సార్ రివ్యూకు డిసెంబర్ 25న సమర్పించాం అని చిత్ర యూనిట్ తెలిపింది. డిసెంబర్ 29 నుంచి మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అని వారు అన్నారు.
అయితే ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ గురించి కోర్టులో వాదనలు వాడివేడిగా జరిగాయి. సెన్సార్ సర్టిఫికెట్ రాకముందే ఎలా రిలీజ్ డేట్ ప్రకటిస్తారు? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దాంతో దేశ సినిమా రంగంలో ప్రతీ సినిమా కూడా సెన్సార్‌తో సంబంధం లేకుండా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తారు. దురంధర్ 2 సినిమాను మార్చి 19న రిలీజ్ చేస్తామని ఆ సినిమా యూనిట్ ప్రకటించిందనే విషయాన్ని ఈ సందర్భంగా కేవీఎన్ నిర్వాహకులు వెల్లడించారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరాం తన ట్విట్టర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి మార్గ నిర్దేశం చేయాల్సిన ప్రభుత్వాలు కేవలం ఓ సినిమాపై పోరాటం చేస్తున్నారు. అది సిగ్గు చేటు. జన నాయగన్ గురించి నా ట్వీట్ కాదు. భవిష్యత్‌లో రాష్ట్ర, కేంద్ర సర్కారుల ఆధీనంలో నడిచే ప్రభుత్వ సంస్థలు చేసే దుర్వినియోగం గురించి మాత్రమే. ఇది మహాత్ముడు పుట్టిన దేశం. డొనాల్డ్ ట్రంప్ పుట్టిన దేశం కాదు అని పీసీ శ్రీరాం తన ట్వీటుతో సంచలనం సృష్టించారు.


Click it and Unblock the Notifications











