AP Elections 2024 ఎమ్మెల్యే కాక ముందే పవన్ కల్యాణ్ ప్రభంజనం.. పిఠాపురంలో ఇదేం మాస్ జాతర!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం పిఠాపురం చుట్టూనే తిరుగుతున్నాయి. జనసేన అధినేత , సినీనటుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడమే ఇందుకు కారణం. పవన్ కోసం మెగా ఫ్యామిలీ, సినీనటులు , అభిమానులు ప్రచారం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పవన్ ఫ్యాన్స్ పిఠాపురానికి చేరుకుని ఆయనను గెలిపించాలని స్వచ్ఛందంగా ప్రచారం చేశారు. ఇందుకోసం తమ సొంత డబ్బును ఖర్చుపెట్టి జనసేనానిపై అభిమానం చాటుకున్నారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వర్మ సైతం ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
ప్రచార గడువు ముగియడానికి కొద్దిగంటల ముందు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ, నిర్మాత అల్లు అరవింద్‌లు పిఠాపురం చేరుకుని పవన్‌కు సంఘీభావం ప్రకటించారు. అటువైసీపీ సైతం పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డింది. అమలాపురం ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురానికి తీసుకొచ్చి ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచింది. స్వయంగా సీఎం జగన్ పిఠాపురంలో రోడ్ షో నిర్వహించి వంగా గీతను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఇరుపక్షాలు ప్రజలను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. దీనికి తగినట్లుగా పిఠాపురం నియోజకవర్గంలో భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా దాదాపు 86.63 శాతం పోటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం దేశ విదేశాల్లో స్థిరపడిన పిఠాపురం వాసులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పోలింగ్ రోజు నాటికి స్వగ్రామాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనంలో ఓ రకమైన కసి కనిపించగా.. అది కూటమిపైనా, లేక అధికార పక్షం మీదనా అనేది జూన్ 4న తెలియనుంది. ఎవరికి వారు గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తుండగా.. వందల కోట్ల రూపాయల బెట్టింగ్స్ జరుగుతున్నాయి.
అయితే ఫలితాలు రాకముందే జనసేన, వైసీపీ కేడర్ 'స్టిక్కర్' వార్‌కి దిగింది. 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అంటూ పవన్ మద్ధతుదారులు.. బైక్‌లు, కార్లకు స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. మొబైల్ ఫోన్స్, వాట్సాప్ స్టేటస్‌లు, ఫేస్‌బుక్ గ్రూపుల్లోనూ దీనిని షేర్ చేస్తున్నారు.
మేం ఏమైనా తక్కువ తిన్నామా అంటూ వైసీపీ కేడర్, వంగా గీత అభిమానులు జనసేనకు స్టిక్కర్లతోనే కౌంటరిస్తున్నారు. డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురానికి వచ్చిన సీఎం వైఎస్ జగన్.. వంగా గీత గెలిస్తే ఆమెను డిప్యూటీ సీఎంను చేస్తానని హామీ ఇచ్చారు. అందుకే ఆమె అభిమానులు డిప్యూటీ సీఎం స్టిక్కర్లు వేయించుకుంటున్నారు.
ఈ పంచాయతీ ఏమో కానీ కాకినాడ, కోనసీమ జిల్లాల్లో స్టిక్కరింగ్ చేసే దుకాణాలకు , వ్యక్తులకు ఎక్కడా లేని డిమాండ్ వచ్చింది. షాపుల ముందు భారీగా వాహనాలు క్యూకడుతున్నాయి. ఇదే అదనుగా కొందరు రేట్లు పెంచేసినట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి పిఠాపురం ఎమ్మెల్యేగా ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











