Pawan Kalyan: కానిస్టేబుల్ కొడుకు నుంచి డిప్యూటీ సీఎం వరకు .. పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇవాళ చంద్రబాబు నాయుడు సారథ్యంలో నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. గన్నవరం ఐటీ పార్క్ సమీపంలో ఉదయం 11.27 గంటలకు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు బాబు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇది లక్షలాది మంది మెగా, పవన్, జనసేన అభిమానులకు అరుదైన క్షణం . పదేళ్ల పాటు కష్టపడి, ఎన్నో అవమానాలు, ఛీత్కారాలను భరించి పవన్ కళ్యాణ్ నేడు డిప్యూటీ సీఎం పదవిని సగర్వంగా అందుకోనున్నారు. ఈ సందర్భంగా పవన్ రాజకీయ ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం.
కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు మూడో కుమారుడిగా జన్మించారు పవన్ . వెంకట్రావు సాధారణ పోలీస్ కానిస్టేబుల్ .. వృత్తి రీత్యా ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు బదిలీ అవుతూ ఉండేవారు. తనకు వచ్చే సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తూ వచ్చారు. వివిధ ప్రాంతాల్లో నివసించడం వల్ల పవన్ కళ్యాణ్‌లో చిన్నప్పటి నుంచి అన్ని యాసలు , మాండలీకాలు, సంస్కృతులు, ప్రజల జీవన విధానంపై అవగాహన ఏర్పడింది. చిన్నప్పుడు పేదరికం కారణంగా ఎన్నో కష్టాలు పడ్డ పవన్ కళ్యాణ్ పేదల అభ్యున్నతి కోసం ఎంతో తపించారు. సినీనటుడిగా ఉంటూనే సమాజ శ్రేయస్సు కోసం పాటుపడడ్డారు. కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను స్థాపించి కోట్లాది రూపాయలు విరాళాలు ఇచ్చారు.

నిజానికి పవన్ కళ్యాణ్‌కు సమకాలీన పరిస్ధితులు, రాజకీయాలపై స్పృహ ఎక్కువ. ఆయనను దగ్గరి నుంచి చూసిన వారికే ఈ విషయాలు తెలుసు. సినిమాలు, షూటింగ్‌లే కాదు.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, పరిస్ధితులపై పవన్‌కు విస్తృతంగా అవగాహన ఉంది. అందుకే అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా కీలకపాత్ర పోషించారు.
తన నమ్మిన సిద్ధాంతాలు, భావజలానికి అనుగుణంగా జనసేన పార్టీని స్థాపించి పోరాటం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు రాజ్యాధికారానికి దూరంగా ఉన్న కొన్ని సామాజికవర్గాలను పాలనలో భాగం చేయాలన్నది పవన్ అభిమతం. ఎన్నో వేదికలపై ఆయన ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. జనసేనను రాజకీయాలకు ప్రయోగశాలగా మార్చి అణగారిన వర్గాల నుంచి ప్రతిభావంతులను, సమర్ధులను నాయకులుగా తీర్చిదిద్దారు పవన్ .

పార్టీ స్థాపించిన కొత్తలో పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని తాను బరిలో నిలవకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్ధతు పలికారు. 2019లో కూటమి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా బరిలో దిగారు. తనకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినా తట్టుకుని నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా ముందుకు కదిలారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెప్పి కూటమి దిశగా అడుగులు వేశారు. చంద్రబాబుకు స్నేహ హస్తం చాచి తోడు నీడగా వ్యవహరించారు. అభ్యర్ధుల ఎంపికలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుని , బీజేపీని కూటమిలోకి తీసుకురావడానికి త్యాగానికి సైతం సిద్ధపడ్డారు.
సీట్ల బేరాలు ముగిసిన తర్వాత కూటమి అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. తన వాడి వేడి ప్రసంగాలతో వైసీపీ ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. తన అభిమానులు, కాపు సామాజికవర్గం ఓట్లను గంపగుత్తగా కూటమికి తరలించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. కేవలం జనసేనానిని చూసే 90 శాతం మంది కాపులు కూటమి అభ్యర్థులకు ఓట్లేశారని అంచనా. కేవలం పవన్ అనే వ్యక్తి లేకుంటే ఈ స్థాయి విజయం కూటమికి లభించేది కాదన్నది అందరూ అంగీకరించే విషయం. పదేళ్లు పదవి, అధికారం లేకుండా అజ్ఞాతవాసం గడిపిన పవన్ ఇప్పుడు.. ఉప ముఖ్యమంత్రిగా తన మార్క్ పాలన ఎలా ఉంటుందో చూపించనున్నారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ.. ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు.


Click it and Unblock the Notifications











