మీ డబ్బులు దోచుకోలేదు కదా.. చూసి చూడకుండా వదిలేయ్.. జానీ మాస్టర్ ఓపెన్ లెటర్
డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో గత వారం రోజులుగా కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఫిలిం ఫెడరేషన్ జానీ మాస్టర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. సినిమా పరిశ్రమను దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేసిన విషయంలో 14 తేదీన విచారణకు హాజరు కావాలని పంపిన నోటీసుకు స్పందించకపోవడంపై తీవ్రంగా స్పందించింది. 7 రోజుల్లో లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసుల్లో తెలిపారు. అయితే షోకాజ్ నోటీసుకు స్పందిస్తూ బహిరంగ లేఖను ఆయన విడుదల చేశారు. ఆ లేఖలో ఏం చెప్పారంటే?
నా పేరు SK.జానిబాష (ప్రముఖ కొరియోగ్రాఫర్, మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ TFTDDA) ఒక బాధ్యతగల కొరియోగ్రాఫర్ గా డాన్సర్స్ యూనియన్ కి ఒక మాజీ ప్రెసిడెంట్‌గా నా యొక్క మనోవేదనను నిర్మాతల దృష్టికి తీసుకుని వస్తున్నాను. నేను ఒక సినీ కార్మికుడిగా నా యొక్క ఎదుగుదలకి నా సంక్షేమానికి దోహదపడింది ముమ్మాటికీ సినీ నిర్మాతలు అని ప్రగాడంగా నమ్ముతాను. అందుకే ప్రతీ నిర్మాతను మేము దైవసమానులుగా భావిస్తాము ఎప్పటికీ కృతజ్ఞతతో నిర్మాతల కోసం మా శాయశక్తులా పని చేస్తాము, చిన్న, పెద్ద, అని తేడా లేకుండా ప్రతీ నిర్మాత క్షేమంగా ఉండాలని కోరుకుంటాము, నిర్మాత బ్రతికి ఉంటే పదిమందిని బ్రతికిస్తాడు, నిర్మాత క్షేమంగా ఉంటే పదిమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తాడు అలాంటి నిర్మాత ఈరోజు ఎన్నో అవాంతరాలని ఎదుర్కొంటున్నాడు పైరసీ రూపంలో థియేటర్ కొటిత తో మరియు కొంతమంది అవినీతికి పాల్పడి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వారి నుండి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతూ కూడా సినిమా మీద ఆసక్తి తో వేలమంది కార్మికులకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో నిర్మాతలు మా అందరికీ పని కల్పిస్తున్నారు అని జానీ మాస్టర్ అన్నారు.

మా డాన్సర్స్ కి నిర్మాతల నుంచి వచ్చిన డబ్బులు మా యూనియన్ లో ఉన్న కొంతమంది ప్రోగ్రాం ఇంచార్జీ లు దోచుకుని తింటున్న వారిపై చర్యలు తీసుకుంటుంటే, ఫెడరేషన్ వారి తప్పులను కప్పిపుస్తూ వారికి సహకరిస్తూ ఎలాంటి చర్యలు తీసుకోనివ్వకుండా మా అసోసియేషన్ కి ఫెడరేషన్ అడ్డు పడుతుంది. దీనికి నష్టపోయిన డాన్సర్ సభ్యులు అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులపై మరియు ప్రెసిడెంట్ గారిపై తీవ్రమైన ఒత్తిడిని పెడుతున్నారు. అందుచేత చర్యలు తీసుకున్న క్రమంలో ఫెడరేషన్ వారు అడ్డు పడుతూ అవినీతి చేసిన వారి యొక్క తప్పులను తోసిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మా డాన్సర్స్ కష్టానికి తగ్గ డబ్బులు నిర్మాతలు ఇస్తుంటే ఆ డబ్బులు కొంతమంది దోచేస్తున్నారు అలాంటి వారికి ఫెడరేషన్ పెద్దలు సహకరిస్తున్నారు అని తన లేఖలో తెలిపారు.
మా సభ్యులు అందరూ నిర్మాత క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మా వంతు బాధ్యతగా మా అసోసియేషన్ లో ప్రస్తుత ప్రెసిడెంట్ గా ఉన్న V.V. సుమలతా దేవి గారి చొరవతో అవినీతి చేస్తున్న కొంతమంది ప్రోగ్రాం ఇంచార్జీ లను వారు ప్రొడక్షన్ కంపెనీ కి పెడుతున్న అక్రమ బిల్లులను పరిశీలించి అవినీతి చేసిన వారిని సస్పెండ్ చేస్తూ, మా యూనియన్ లో పదివీ బాధ్యతతో ఉన్న వారిపై కూడా నిర్మాతలను మరియు మా డాన్సర్స్ ను మోసం చేసిన వారిపైన కూడా వారి పదవిని కూడా తొలగిస్తూ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నాము. అలా అవినీతికి పాల్పడిన మా జెనరల్ సెక్రెటరీ ని పదవి నుంచి తొలగించాము. తనకి సపోర్ట్ చేస్తూ కొంతమంది కమిటీ సభ్యులు రాజీనామాలు చేసిన వారిని కూడా జనరల్ బాడీ మీటింగ్లో తొలగించి ఉపఎన్నికలు నిర్వహించుకోవాలని తీర్మానం చేసుకున్నాం అని జానీ మాస్టర్ లేఖలో వెల్లడించారు.
అలా చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఫెడరేషన్ వారి నుండి మాకు సహకారం అందలేదు, ఎంత అవినీతి చేసినా కుడా వారితో కలసి పని చెయ్యాలని, మా ప్రెసిడెంట్ సుమలతా దేవి గారిని మిగిలి ఉన్న (రాజీనామాలు చేయని) కమిటీ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు, మా యూనియన్ అంతర్గత విషయాలలో తలదూర్చి మా స్వేచ్చకు భంగం కలిగిస్తున్నారు ఫెడరేషన్ పెద్దలు, నిన్న అనగా 16-07-2026 తేదీన ఫెడరేషన్ లో జరిగిన జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో మేము సస్పెండ్ చేసి పదవి నుంచి తొలగించిన వారిని మళ్ళి వారి పదవిలో కొనసాగించాలని కలుపుకొని పోవాలని మా ప్రెసిడెంట్ సుమలతా దేవి గారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. జనరల్ కౌన్సిల్ మీటింగ్ కు హాజరు అయిన వారిలో కొంతమంది కౌన్సిల్ మెంబెర్ లు అన్న మాటలు మాకు తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి అని అన్నారు.
మీ అసోసియేషన్ డబ్బులు దోచుకోలేదు కదా, నిర్మాతలు డబ్బులు కదా ఇందులో తప్పు ఏమి ఉంది ఇలాంటివి చూసీ చూడనట్లుగా కలుపుకుని పోవాలి అని మాట్లాడారు , ఇలాంటి వ్యాఖ్యలు వింటున్నా కూడా ఫెడరేషన్ పెద్దలు మౌనంగా ఉండటం మా అసోసియేషన్ అధ్యక్షురాలు మరియు కమిటీ సభ్యులు జీర్ణించుకోలేక పోయారు, ఫెడరేషన్ పెద్దలు ఒకవైపు నిర్మాతల శ్రేయస్సు కోసం ఉన్నాము అంటూ బయట చెబుతూ, ఇలా నిర్మాతలను మోసం చేస్తున్న వారిని చూసీ చూడనట్లు పోవాలి అని మాట్లాడుతున్నారు వారిని తొలగిస్తే మళ్ళి పదవిలోకి తీసుకోండి అని మాపై జులుం చూపిస్తూ వారు చెప్పినట్లు వినకపోతే ఫెడరేషన్ నుండి "నాన్ క్రో ఆపరేషన్" చేస్తామని పదే పదే బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఫెడరేషన్ పెద్దలు ఒకవైపు కార్మికుల క్షేమమే మా ధ్యేయం అని చెబుతూ మరోవైపు డాన్సర్స్ కు చెందాల్సిన డబ్బులు ను దోచుకున్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని జానీ మాస్టర్ తీవ్రంగా స్పందించారు.
మా ప్రెసిడెంట్ గారు ఒంటరి మహిళగా మా అసోసియేషన్ లో జరుగుతున్న అవినీతిని బయటపెడుతూ నిర్మాతల్ని మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటూ మా యూనియన్ అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటే, ఫెడరేషన్ వారికి అధికారాలు ఉన్నాయి అని లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు రూల్స్ చెబుతూ మా అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటూ వారు చెప్పినట్లే వినాలి అని లేకుంటే ఫెడరేషన్లో సభ్యత్వాన్ని తొలగిస్తామని (Boycott) చేస్తామని చెబుతున్నారు. ఒక మహిళా మేము చెప్పినట్లు వినదా? మా పరువుకు భంగం కలుగుతుందనే నెపంతో లింగ బేధం కనబరుస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఫెడరేషన్ పెద్దలు, మేము డాన్సర్స్ యూనియన్ ఎల్లవేళలా నిర్మాత క్షేమాన్ని కోరుకుంటాం అని అన్నారు.
అలాంటి నిర్మాతను మరియు మా డాన్సర్స్ ను మోసం చేసే బేరర్స్ ను ప్రోగ్రాం ఇంచార్జీ లను వారి అవినీతిని సహించము. వారిపై ఖటిన చర్యలు తీసుకుంటాము, కాని మాకు ఫెడరేషన్ నుండి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అవినీతి చేసిన వారిని,, వారి అవినీతిని ప్రోతహిస్తున్న కొంతమంది కమిటీ సభ్యులను వదిలి వెయ్యాలని ఫెడరేషన్ వారు కలుపుకుని పోవాలని సూచిస్తున్నారు, కావున దయచేసి నా విన్నపాన్ని సహృదయంతో స్వీకరించి నిర్మాతలు చొరవ తీసుకుని, ఫెడరేషన్ వారు చేస్తున్న నాటకీయ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని, మా డాన్సర్స్ యూనియన్ అంతర్గత విషయాలలో జోక్యం తీసుకోనివ్వకుండా మేము స్వేచ్చగా ఉపఎన్నికలు జరుపుకునేలా చూడాలని నిర్మాతల పెద్దల్ని ప్రాధేయపడుతున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు.
మా స్వేచ్చకు ఫెడరేషన్ వారి నుండి మా డాన్సర్స్ యూనియన్ కు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేలా ఫెడరేషన్ వారిని మంధలిస్తారని ఆశిస్తున్నాము, ఎల్లప్పుడూ నిర్మాతల శ్రేయస్సు కోరుకునే మా డాన్సర్స్ యూనియన్ ను ఆదుకుంటారని ఒక భాద్యత గల ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఒక మాజీ అధ్యక్షుడుగా వినమ్రతతో సినీ నిర్మాతల పెద్దల్ని ప్రాదేయపడుతున్నాను, నా విన్నపాన్ని సహృదయంతో స్వీకరించి మాకు తగు న్యాయం చేస్తారని ఆశిస్తూ.... నమస్కారములు అంటూ జానీ మాస్టర్ లేఖ రాశారు.


Click it and Unblock the Notifications