ఆ హీరోని తప్ప మరొకరిని ఊహించుకోలేనంటున్న సమంత
అక్కినేని కోడలు సమంత సినిమాల్లో ఎంత యాక్టివ్‌గా నటిస్తుందో.. ఆ సినిమా ప్రమోషన్స్ లోనూ అంతే యాక్టివ్‌గా పనిచేస్తుంది. తన సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో ఆ సినిమా అప్‌డేట్స్ ఇవ్వడం, ప్రత్యేక ఇంటర్వూస్ ఇస్తూ అందరినీ ఆకట్టుకోవడం సమంత స్టైల్. ఈ నేపథ్యంలోనే ఆమె తాజా సినిమా 'జాను' ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంటోంది సామ్.
సమంత లీడ్ రోల్ పోషించిన 'జాను' మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. తమిళ నాట విడుదలై దక్షిణాదిని ఓ ఊపు ఊపిన 96 చిత్రానికి రీమేక్ సినిమానే ఈ జాను. ఈ సినిమాలో సమంతకు జోడీగా యంగ్ హీరో శర్వానంద్ నటించాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి.

కాగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా విశేషాలను పంచుకుంది సమంత. ఈ మేరకు శర్వానంద్ తో నటించడం ఎలా అనిపించిందో తెలిపింది. ''జాను సినిమాలో మా పెర్ఫామెన్స్‌లే ప్రధానం. ఒకరి పెర్ఫామెన్స్‌పై మరొకరి పెర్ఫామెన్స్ ఆధారపడి ఉంటుంది. బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకున్నాం. రామ్ పాత్రలో శర్వా తప్ప మరొకరిని ఊహించుకోలేను. మరొకరు ఉండుంటే ఈ మ్యాజిక్ రీ క్రియేట్ అయ్యేది కాదేమో'' అని చెప్పింది సమంత.
హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు. సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా.. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు.


Click it and Unblock the Notifications











