ఆ హీరో వల్లే చిరంజీవి సినిమా చేజారింది.. జేడీ చక్రవర్తి షాకింగ్ రివీల్
ఇండస్ట్రీలో విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి (J.D. Chakravarthy)గురించి పెద్దగా పరిచయం అసవరం లేదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన ప్రతిభావంతులైన నటుల్లో జేడీ ఒకరు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, దర్శకుడిగా పలు రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం మళ్లీ వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. తాజాగా తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న గాయపడ్డ సింహం (Gayapadda Simham) సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా మే 1న విడుదల కానుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో జేడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. తన కెరీర్, సినిమా ఎంపికలు, మిస్ అయిన అవకాశాల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో కలిసి నటించాలన్న కోరిక ఇప్పటికీ నెరవేరలేదని భావోద్వేగంగా తెలిపారు. జేడీ మాట్లాడుతూ, "చిరంజీవి గారు అంటే నాకు అపారమైన అభిమానం. ఆయన సినిమాలు మాత్రమే కాదు, బయట వ్యక్తిత్వం కూడా నాకు ఎంతో ఇష్టం. ఆయనతో ఒక సినిమాలో అయినా కలిసి నటించాలి అనేది నా కోరిక. కానీ ఇప్పటివరకు అది జరగలేదు'అని చెప్పారు.

అలాగే తనకు ఒకసారి చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చినా, అది చివరి నిమిషంలో చేజారిపోయిందని వెల్లడించారు. ఆ సినిమానే 'అన్నయ్య' సినిమాలో చిరంజీవి తమ్ముళ్ల పాత్ర కోసం తనని, హీరో శ్రీకాంత్ ను సంప్రదించారట. ఈ సమయంతో తాను ఎంతో సంతోషించనని తెలిపారు. అయితే మొదట శ్రీకాంత్ అంగీకరించిన తర్వాత కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అలా శ్రీకాంత్ తప్పుకోవడం వల్ల చివరకు ఆ అవకాశం నాకు రాలేదు'అంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ విషయం తనకు అప్పట్లో బాధ కలిగించినా, భవిష్యత్తులో చిరంజీవితో కలిసి పనిచేసే అవకాశం తప్పకుండా వస్తుందని నమ్ముతున్నానని తెలిపారు.
ఇక తాను దర్శకత్వం వహించిన ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించీ ప్రస్తావించారు. 'కొన్ని సంవత్సరాల క్రితం నేను దర్శకత్వం వహించిన 'మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ' సినిమా ప్రారంభానికి చిరంజీవి గారు వచ్చి నన్ను ఆశీర్వదించారు. ఆ సినిమా 80 శాతం వరకు షూటింగ్ పూర్తయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది' అని గుర్తు చేసుకున్నారు. తమ ఇద్దరి కలయిక కోసం ప్రకృతి ఇంకా ఎదురు చూస్తోందేమో అంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. 'చిన్న చిన్న ప్రాజెక్టులు కాకుండా, మేమిద్దరం కలిసి చేసే పెద్ద సినిమా కోసం ప్రకృతి వేచి చూస్తోందనిపిస్తుంది'అని అన్నారు.
ఇక తన కెరీర్‌లో జరిగిన మార్పుల గురించి మాట్లాడుతూ.. గతంలో చాలా సెలెక్టివ్‌గా ఉండేవాడినని తెలిపారు. "నాకు కథలో ఒక కిక్, ఒక హై ఫీలింగ్ రావాలి. అలా అనిపించినప్పుడే సినిమా చేసేవాడిని. అందుకే చాలా అవకాశాలు వదిలేశాను. ఇండస్ట్రీ నాకు అవకాశాలు ఇవ్వలేదని అనడం తప్పు. సినిమాలు చేయకపోవడం నా నిర్ణయం'అని స్పష్టం చేశారు. ఇప్పుడు మాత్రం తన ఆలోచన మారిందని చెప్పారు. 'ఇకపై మంచి పాత్రలు వస్తే వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ మార్పుకు కారణం దయ వెబ్ సిరీస్. ఆ ప్రాజెక్ట్ నాకు మళ్లీ కొత్త ఉత్సాహం ఇచ్చింది'అని తెలిపారు.
ఇక 'గాయపడ్డ సింహం' గురించి మాట్లాడుతూ, ఈ సినిమా తన కెరీర్‌లో మరో మలుపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీజర్‌లో తన పాత్ర పాత హిట్స్‌ను గుర్తు చేసినా, కొత్త కోణంలో డిజైన్ చేశారని చెప్పారు. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, 'గాయపడ్డ సింహం' మంచి విజయం సాధిస్తే జేడీ చక్రవర్తికి మళ్లీ వరుస అవకాశాలు వచ్చే అవకాశముంది. ఆయనకు ఉన్న అనుభవం, విభిన్న పాత్రలను పోషించే సామర్థ్యం ఇండస్ట్రీకి అవసరమేనని అంటున్నారు.


Click it and Unblock the Notifications