విజయ నిర్మల మరణం తీరని లోటు.. జీవిత భావోద్వేగం
సీనియర్ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల (73) మరణం సినీ లోకాన్ని తీవ్రంగా కలచి వేసింది. గుండెపోటు కారణంగా ఆమె మరణించిందన్న వార్తను జీర్ణించుకోలేక పోతున్నారు టాలీవుడ్ జనం. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ ఇంటిలో ఉంచిన విజయనిర్మల భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం విజయనిర్మల మృతిపై స్పందించిన నటి జీవిత.. ఆమె మృతి పట్ల తన సానుభూతిని తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యింది.
ఆమె మాట్లాడుతూ.. విజయనిర్మల మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొంది. ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన విజయనిర్మల జీవితం స్ఫూర్తిదాయకమని తెలుపుతూ కంటతడి పెట్టింది జీవిత. విజయనిర్మల కుటుంబ సభ్యులకు దైర్యం, ఆత్మ స్థైర్యం చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని చెప్పింది జీవిత.

విజయనిర్మలది మంచి మనసు అని, ఎంతో మందికి సహాయం చేసిన చల్లని చేయి ఆమెదని జీవిత తెలిపింది. నాటి నుంచి నేటి వరకూ ఆవిడతో పోల్చి చూడగల నటి ఎవ్వరూ లేరని చెప్పింది. నటిగా, దర్శకురాలిగా, సినీ పెద్దగా ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని జీవిత వెల్లడించింది. ఆవిడ సాధించిన విజయాలు అసామాన్యమని పేర్కొంటూ విజయనిర్మల ఎప్పటికీ లెజెండ్ అని తెలిపింది జీవిత. ఒకరినొకరు అర్ధం చేసుకుని, ఒకరిని మరొకరు వదలకుండా మంచి అండర్‌స్టాండింగ్‌తో కృష్ణ, విజయనిర్మల దంపతులు ఉండేవారని, ఆ ఇద్దరి దాంపత్య జీవితం ఎంతోమందికి స్ఫూర్తి అని జీవిత తెలిపింది.
ఈ రోజంతా విజయనిర్మల భౌతిక కాయాన్ని ఆమె ఇంటి వద్దే ఉంచి శుక్రవారం ఉదయం ఫిలింఛాంబర్‌కు తరలించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం విజయ నిర్మల అంత్యక్రియలు చిలుకూరులో గల ఆమె ఫామ్ హౌస్‌లో జరుగుతాయని సమాచారం.


Click it and Unblock the Notifications











