Narmada అమెరికా బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. నర్మదగా లీడ్ రోల్‌లో..
తన ఊరిలో జరుగుతోన్న అన్యాయాలను నర్మద అనే యువతి ధీటుగా ఎదిరించాలని నిర్ణయం తీసుకొంటుంది. కానీ అందుకు తన స్థాయి, శక్తి సరిపోదని తెలుసుకుంటుంది. దాంతో తన రూట్ మార్చి ఆమె సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఓ స్టార్ హీరోయిన్‌గా ఎదిగి ఆ తర్వాత తన ఊరి సమస్యను ఎలా సాల్వ్ చేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులను నర్మద ఎదుర్కొన్నది అన్నది కథాంశం.

జెమిని, సౌమిక, సంహిత్ సిల్వర్ స్క్రీన్స్ బేనర్స్‌పై మోహన్ వడ్లపట్ల సమర్పణలో డా. ఎంఆర్ సి చౌదరి, ఆళ్ల రాఘవ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నర్మద. ఈ చిత్రంతో శుభాకర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. జో శర్మ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఫిలించాంబర్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర సమర్పకుడు మోహన్ వడ్లపట్ల క్లాప్ కొట్టగా నటుడు కాదంబరి కిరణ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు ముప్పలనేని శివ గౌరవ దర్శకత్వం వహించారు. జెమిని రమేష్, పద్మిని నాగవల్లి, రమ్య శ్రీ, పూజిత తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎంఆర్సీ చౌదరి మాట్లాడుతూ... దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఆళ్ల రాఘవ, జెమిని వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాం. అమెరికాలో పలు చిత్రాల్లో నటించిన జో శర్మ నర్మద టైటిల్ పాత్రలో కనిపిస్తుంది. చాలా మంది హీరోయిన్లను పరిశీలించాక జో శర్మ అయితే మా సినిమాలో పాత్రకు పర్‌ఫెక్ట్ అని ఆమెను తీసుకున్నాం. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి రాజమండ్రిలో తొలి షెడ్యూల్ ప్రారంభిస్తాం. 12 రోజులపాటు అక్కడ షూటింగ్ చేసి రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అన్నీ అనుకూలిస్తే పాటలను విదేశాల్లో చిత్రీకరించాలన్న ఆలోచన ఉంది అని అన్నారు.
చిత్ర సమర్పకుడు మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ...దర్శకుడు గతంలో ఓ ఓటీటీ సినిమా చేశాడు. ఫ్యూచర్ ఫిలింగా ఇది మొదటిది. మంచి స్టోరీతో పాటు టైటిల్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది. జో శర్మ, అమెరికాలో పలు చిత్రాల్లో నటించింది. అలాగే బాలీవుడ్‌లో కూడా నటిస్తున్నది. తెలుగులో ఆమెకు తొలి చిత్రం. ఇందులో టైటిల్ రోల్‌లో నటిస్తున్నది. ఈ చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు.
నటి జో శర్మ మాట్లాడుతూ.. నేను అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయిని. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మోహన్ వడ్లపట్లకు మా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఇందులో నర్మద రోల్ చేస్తున్నా. స్టోరి చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది అన్నారు.
దర్శకుడు శుభాకర్ మాట్లాడుతూ... ప్రతిభ ఎక్కడున్నా దాన్ని వెతికి పట్టుకుని అవకాశాలు కల్పించడంలో మా నిర్మాతలు ముందుంటారు. నర్మద చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని కల్పించిన మా నిర్మాతలకు ధన్యవాదాలు. ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా చేయడానికి మా నిర్మాతలు పూర్తి స్వేచ్ఛనిచ్చారు అని అన్నారు.


Click it and Unblock the Notifications











