NTR30: ఎన్టీఆర్ సినిమా ఆలస్యానికి కారణం ఇదే.. కొరటాల ఫోకస్ దాని మీదే
గతంలో చాలా ఫ్లాపులతో ఇబ్బందులు పడినా.. కొంత కాలంగా వరుసగా హిట్ల మీద హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ భీకరమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు నందమూరి హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' నుంచి మొదలుకొని వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి విజయాలను అందుకున్న తారక్.. ఈ జోష్‌తోనే ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఈ మూవీ షూటి చాలా రోజుల క్రితమే పూర్తైపోయింది.
RRR మూవీ షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాత చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ, ఈ ప్రాజెక్టు ప్రకటనకే పరిమితం అయింది. దీంతో టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన కొరటాల శివతో సినిమాను ప్రకటించాడు. 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా చాలా రోజులుగా అటు సోషల్ మీడియాలో, ఇటు ఫిలిం నగర్‌లో విపరీతంగా మారుమ్రోగుతోంది.

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో రాబోతున్న ఈ మూవీ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల ఇది పట్టాలెక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఫిబ్రవరి 7వ తేదీన మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారని ప్రచారం జరిగింది. అంతేకాదు, దీనికి ఫలానా గెస్టులు హాజరు అవుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు యమ సంతోషించారు. అయితే, అనుకున్న ప్రకారం ఈ మూవీ మాత్రం ఆరోజు ప్రారంభం కాలేదు. అంతేకాదు, ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం మార్చి నెలలో మొదలు అవుతుందన్న ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోయే ఈ సినిమా అసలు ఎందుకు ఆలస్యం అవుతుందన్న దానిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా నడుస్తూనే ఉందట. వాస్తవానికి ఇప్పటికే అది పూర్తైనా.. కొన్ని మార్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో ముగ్గురు రచయితలు దీనిపై వర్క్ చేస్తున్నారని తెలిసింది. అది ఒక్కసారి పూర్తైతే సినిమాను మొదలెట్టి.. నిరంతరంగా షూటింగ్ జరపాలని ప్లాన్ చేసినట్లు ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా ఫారెస్ట్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందట. ఒక స్టూడెంట్ లీడర్ ఫారెస్ట్ మాఫియాను ఎలా మార్చాడన్నదే ఈ మూవీ స్టోరీ లైన్ అని సమాచారం. ఇందులో తారక్ రెండు విభిన్నమైన గెటప్‌లలో కనిపించబోతున్నాడని టాక్. ఈ చిత్రంలో ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుందట. అలాగే, దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడట. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోయే ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











