Jr NTR సింహాద్రి షో థియేటర్‌లో పొగలు.. పరుగులు పెట్టిన విదేశీయులు.. వీడియో వైరల్
సినీ ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబంలో ఒకటైన నందమూరి ఫ్యామిలీ నుంచి చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తారక్ అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆయనకు ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. అయితే ఇటీవల రీరిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి సినిమాను విడుదల చేశారు. అయితే ఈ సినిమా వేసిన థియేటర్లలో పొగలు రావడం హాట్ టాపిక్ గా మారింది.
రీ రిలీజ్ ట్రెండ్:టాలీవుడ్‌లో కొంత కాలంగా రీ రిలీజ్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలకు సంబంధించిన పుట్టినరోజునో, మరో ప్రత్యేకమైన డేకో వాళ్లు నటించిన సూపర్ హిట్ చిత్రాలను 4K టెక్నాలజీలోతో మరోసారి విడుదల చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలు వచ్చి మంచి ఆదరణను అందుకున్నాయి.

విదేశాల్లో కూడా:ఈ క్రమంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ మూవీ 'సింహాద్రి' కూడా మరోసారి తెరపై సందడి చేసింది. యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని మే 20న మళ్లీ విడుదల చేశారు. అయితే సింహాద్రి సినిమాను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమా హంగామా విడుదలకు ముందు నుంచి మొదలైంది.
థియేటర్ నుంచి పరుగులు:అయితే యూకేలోని వెస్ట్ లండన్ లో అభిమానుల మితిమీరిన ఉత్సాహంతో థియేటర్లలో కూడా క్రాకర్స్ పేల్చారు. దీంతో థియేటర్ లో పొగలు కమ్ముకున్నాయి. అది చూసిన ప్రేక్షకులు భయంతో థియేటర్ నుంచి బయటకు పరుగులు పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

స్మోక్ అలారంతో:ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వెంటనే రంగంలోకి దిగింది. పొగలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడ ఏర్పాటు చేసిన స్మోక్ అలారం మోగడంతో అందరూ అలర్ట్ అయ్యారని లండన్ ఫైర్ బ్రిగేడ్ తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగలేదని నిర్వాహకులు తెలిపారు.

నిజమైన ఫ్యాన్స్ కాదంటూ:రాత్రి 10:13 గంటల నుంచి 10:39 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో థియేటర్ లో షోను రద్దు చేసినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే అయితే ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులు నిజమైన అభిమానులు కాదని పలువురు వెల్లడించారు. దీంతో చాలా మంది నెటిజన్లు, ఫ్యాన్స్ ఎన్టీఆర్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. భారతీయులకు చెడ్డ పేరు తీసుకురావద్దని అభిమానులకు సలహా ఇవ్వాలని ఎన్టీఆర్ ను అభ్యర్థిస్తున్నట్లుగా ఆ పోస్టులు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











