దటీజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. శ్యామ్ కుటుంబానికి అండగా.. గొప్ప మనసు చాటుకొన్న యంగ్ టైగర్ అభిమానులు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ ఆత్మహత్య సంఘటన తర్వాత అనేక ట్విస్టులు చోటు చేసుకొంటున్నాయి. శ్యామ్ మరణానికి రాజకీయ రంగు పులుముకోవడంతో అత్యంత వివాదంగా మారింది. అయితే ఈ వ్యవహారం అనేక వివాదాలకు దారి తీస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు స్పందించిన తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు తీసుకొన్న చొరవ విషయంలోకి వెళితే..
నిరుద్యోగంతో బాధపడుతున్న ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ నిరాశకు లోనై ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. తాను తన మొబైల్ ఫోనులో రికార్డు చేసిన చివరి వీడియోలో తాను మాట్లాడుతూ.. ఈ జీవనపోరాటంలో ఓడిపోయాను. నేను ఉన్నా లేకపోయిన ఒకటే. నేను జాబ్ చేయలేను. ఈ జన్మకు ఇంతే.. మరో జన్మ ఉంటే నేను మళ్లీ నీ కొడుకుగా పుడుతాను. మమ్మీ, డాడీ క్షమించండి అంటూ వీడియోలో వేడుకొన్నాడు.

అయితే జూన్ 25వ తేదీన మరణించిన శ్యామ్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్థులు ఎవరూ కూడా అంత్యక్రియల్లో పాల్గొనలేదని, కుటుంబ సభ్యులు మాత్రమే అతడికి దహన సంస్కారాలు నిర్వహించారు. గ్రామస్థుల సహకారం లభించలేదనే విషయం సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు స్పష్టం చేశాయి.

అయితే శ్యామ్ మరణంతో దిక్కు తోచని పరిస్థితుల్లో పడిన కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండగా నిలిచారు. వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొనేందుకు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ అభిమానులు శ్యామ్ కుటుంబాన్ని ఆదుకొంటామని ప్రకటన కూడా చేశారు.

శ్యామ్ మన నుంచి దూరమయ్యారు. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకు రాలేము. కానీ శ్యామ్ కుటుంబానికి మేము అండగా నిలుస్తాం. ఇప్పటికే శ్యామ్ తల్లిదండ్రులతో మాట్లాడటం జరిగింది. వాళ్లకి అన్ని విధాలుగా ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది అని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
శ్యామ్ తన కుటుంబానికి వెన్నముక లాంటి వ్యక్తి. తను లేని లోటు ఆ కుటుంబానికి ఎవరూ కూడా తీర్చలేరు. అందుచేత శ్యామ్ చెల్లెలు పెళ్లి బాధ్యతను మేము తీసుకొంటున్నాం. అలాగే జరిగిన సంఘటన మీద పోలీసు శాఖను స్పష్టమైన దర్యాప్తు చేయమని కోరుతున్నాం అని ఎన్టీఆర్ అభిమానులు వేడుకొన్నారు.


Click it and Unblock the Notifications











