అప్పుడు మా తాత.. ఇప్పుడు నేను.. ఇది పూర్వజన్మ సుకృతం: ఎన్టీఆర్ ఎమోషనల్
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా బెంగళూరులో జరిగిన ప్రముఖ కార్యక్రమంలో పాల్గొని మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో నిర్మించిన కొత్త స్పెషాలిటీ బ్లాక్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, స్థానిక ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అదే సమయంలో తమ అభిమాన నటుడిని ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో అభిమానులు కూడా భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు.
తాత జ్ఞాపకాలను గుర్తు చేసిన ఎన్టీఆర్
ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎన్టీఆర్ ఈ ఆస్పత్రికి తమ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1983 మార్చి 20న తన తాత ఎన్టీ రామారావు ఈ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని చెప్పారు. ఇన్నేళ్ల తర్వాత అదే మార్చి నెలలో తాను ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 'కర్ణాటకకు రావడం అంటే నాకు అమ్మమ్మ ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. తాత ఆశీస్సులు, మీ అందరి ప్రేమ వల్లే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది' అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా అభిమానులకు రోడ్డు భద్రతపై కూడా ఎన్టీఆర్ కీలక సూచనలు చేశారు. ఆ సందర్భంలో మాట్లాడిన ఎన్టీఆర్, తన కుటుంబానికి ప్రమాదాలు ఎలా ప్రభావం చూపాయో చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో తన తండ్రి.. పెద్దన్నయ్యను కోల్పోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ ఘటనలు తన జీవితంలో పెద్ద మార్పు తీసుకువచ్చాయని అన్నారు. అందుకే రోడ్డు భద్రత ఎంత ముఖ్యమో తనకు బాగా తెలుసని చెప్పారు. వాహనాలను నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని ఆయన సూచించారు. ఎప్పటిలాగే డ్రైవింగ్ సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని అభిమానులను కోరారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు ఎన్టీఆర్‌ను కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. 'పాతికేళ్ల తర్వాత మీరు ఎలా ఉంటారు?' అని ఒక వైద్యుడు అడగగా, అప్పటికి తన వయసు 67 ఉంటుందని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. కానీ, అభిమానులు మాత్రం 'సీఎం.. సీఎం..' అంటూ నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. ఈ కార్యక్రమంలో భారీ ఫ్లెక్సీలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ అభిమాన నటుడికి ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ ను చూడటానికి వేలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
'డ్రాగన్' సినిమా లుక్ వైరల్
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కొత్త లుక్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తిగా కొత్త స్టైల్‌లో కనిపిస్తున్నారు. చెవికి రింగ్ పెట్టుకున్న ఆయన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకి 'డ్రాగన్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఎన్టీఆర్ సరసన కన్నడ నటి రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
మే 20న ఫస్ట్ లుక్ విడుదల?
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశముందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టైల్‌లో వస్తున్న ఈ చిత్రం మరో భారీ విజయంగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమం ఎన్టీఆర్ అభిమానులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. ఒకవైపు ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొని సేవా కార్యక్రమానికి తోడ్పడగా, మరోవైపు అభిమానులను పలకరించి వారి మనసులు గెలుచుకున్నారు.


Click it and Unblock the Notifications











