NTR: ఎన్టీఆర్ పేరును టచ్ చేస్తే ఖబర్దార్.. యంగ్ టైగర్‌కు రక్షణగా ఢిల్లీ హైకోర్టు వార్నింగ్!
సోషల్ మీడియాలో తమ వ్యక్తిత్వాన్ని, ప్రతిష్టను దిగజార్చే విధంగా చేస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు సినీ తారలు తగిన చర్యలు తీసుకొంటున్నారు. తమ పేరును, తమ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలపై తప్పుడు రీతిలో, చెడుగా ప్రొజెక్ట్ చేస్తూ పోస్టులు పెట్టడాన్ని నిరోధించాలని పలువురు తారలు ఇప్పటికే కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఆ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇటీవల తన వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు సానుకూలంగా స్పందిస్తూ అందుకు సంబధించిన ఆదేశాలను జారీ చేసింది. ఈ విషయాన్ని ఆయన పీఆర్ వర్గాలు అధికారిక ప్రకటనను రిలీజ్ చేశారు.
వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన జరుగకుండా నందమూరి తారక రామారావుకు ప్రొటెక్షన్ కలుగుజేస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో అనధికారికంగా తమ కమర్షియల్, వ్యక్తిగత హక్కులకు భంగం కలుగకుండా రక్షణ కల్పించాలని ఆయన చేసిన రిక్వెస్ట్‌కు కోర్టు సానుకూలంగా స్పందించింది. NTR, Jr NTR, Tarak, Nandamuri Taraka Rama Rao Jr, Jrn Nandamuri Taraka Rama Rao పేర్లను అనధికారికంగా దుర్వినియోగం చేయకూడదు. అలాగే తనకు సంబంధించి మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ లాంటి ట్యాగ్స్‌ను కూడా దుర్వినియోగం చేయకుండా నిరోధించాలని తన పిటిషన్‌లో అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఇలాంటి పదాలను అనధికారికంగా వాడుతూ దుర్వినియోగం చేసినట్టు భావిస్తే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటాం అని తమ ఉత్తర్వుల్లో తెలిపింది.

దేశంలో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పేరుకు ప్రత్యేకమైన హోదా ఉంది. తన కెరీర్‌లో సాధించిన పురోగతి కారనంగా ఆయనకు ప్రత్యేకమైన హోదా, పేరు ప్రతిష్టలు సంపాదించుకొన్నారు. ప్రజల మనసులో ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కాబట్టి ఆయన వ్యక్తిత్వంపై సర్వహక్కులు కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన ప్రతిష్టకు, హోదాకు ఎలాంటి భంగం కలుగనీయకూడదని కోర్టు కూడా భావించింది. ఈ మేరకు ఈ ఆదేశాలను జారీ చేసింది అని ప్రకటనలో సారాంశంగా వెల్లడించారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కుల భాగంగానే వ్యక్తిత్వ, పబ్లిసిటీ రైట్స్‌ను గుర్తించింది. కాపీరైట్ యాక్ట్, 1957, ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999 ప్రకారం ఆయన జీవితాన్ని, హోదాను పరిగణనలోకి తీసుకొన్నది. కాబట్టి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్, డిజిటల్ మీడియాలో ఏవైనా కథనాలు రాస్తే.. వాటిని ఈ చట్టం కిందకు వస్తాయని భావించాల్సి ఉంటుంది. అలాంటి కంటెంట్ ఐటీ రూల్స్ 2021 కిందకు వస్తుందనే విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా ఉత్వర్వుల ప్రకారం.. ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని, పబ్లిసిటీ రైట్స్ హరించే విధంగా, వ్యాపార ప్రకటనలు, మార్ఫింగ్ చిత్రాలు, ఏఐతో రూపొందించిన కంటెంట్, వ్యాపార లాభాపేక్షకు ఉపయోగించే అసమంజస కంటెంట్ విషయంలో ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ఎన్టీఆర్ హక్కుల రక్షణకు పాటుపడుతుంది. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా రక్షణ కల్పిస్తుంది. ఆయన ప్రతిష్టకు ఏ మాత్రం భంగం కలిగించే విధంగా కథనాలు, డిజిటల్ కంటెంట్ ఉపయోగిస్తే.. చట్ట రీత్యా శిక్షార్హులు అవుతారు అని తాజా ఉత్తర్వుల్లో కోర్టు తెలిపింది.


Click it and Unblock the Notifications











