నారా లోకేష్‌కు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే విషెస్.... రాజకీయాల్ని హీటెక్కించిన తారక్ ట్వీట్
తెలుగువారి ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టారు జూనియర్ ఎన్టీఆర్. నటన, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింటిలో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. ఈ తరంలో నవరసాలను అద్భుతంగా పండించగల నటుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు తారక్. సినీనటుడిగా తిరుగులేని స్టార్ అనిపించుకున్న తారక్.. రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ బాధ్యతలు స్వీకరించి టీడీపీని నడిపించాలని వారంతా ఆకాంక్షిస్తున్నారు.
తొలి నుంచి టీడీపీకి అండగా నిలిచారు తారక్.. 2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున మహాకూటమి అభ్యర్ధుల తరపున ప్రచారం చేశారు. విషయ పరిజ్ఞానం, వాగ్ధాటితో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీపై ఆయన చేసిన విమర్శలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆ ఎన్నికల్లో తారక్ ప్రచారం చేసిన మెజారిటీ స్థానాల్లో కూటమి అభ్యర్ధులు విజయం సాధించారు. అయితే అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ దూరమయ్యారు. నందమూరి కుటుంబంతో పాటు నారా ఫ్యామిలీతోనూ తారక్‌కి గ్యాప్ పెరిగింది.

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ జగన్ విజయం సాధించడంతో ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని సొంత పార్టీ నేతలు, నందమూరి అభిమానుల నుంచి భారీగా డిమాండ్లు వచ్చాయి. చంద్రబాబు, లోకేష్ పాల్గొనే సభలతో పాటు సినీ కార్యక్రమాల్లోనూ ఎన్టీఆర్ అభిమానులు సీఎం.. సీఎం అని నినాదాలు చేయడం తారక్ వాటిని వారించడం అప్పట్లో కలకలం అయ్యింది. అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సారథ్యంలో టీడీపీ విజయం సాధించడంతో ప్రస్తుతానికి ఎన్టీఆర్ అభిమానులు సైలెంట్ అయ్యారు. అయితే ఎప్పటికైనా తెలుగుదేశం భావి రథసారథిగా తారక్ నాయకత్వం వహిస్తారని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో భవిష్యత్తులో టీడీపీ వారసత్వం కోసం ఎన్టీఆర్ - నారా లోకేష్‌ల మధ్య పోరాటం తప్పదని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.
అయితే లోకేష్ సైతం అన్ని రకాలుగా రాటుతేలుతున్నారు. యువగళం పాదయాత్ర తర్వాత ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. నిర్ణయాలు తీసుకోవడంలోనూ, మాట తీరులోనూ లోకేష్‌లో పూర్తి మార్పు కనిపిస్తోంది. పాలనాపరంగానూ తన ముద్ర కనిపించేలా చూసుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు లోకేష్‌పై మండిపడుతున్నారు. తెరవెనుక ఏపీలో పాలన మొత్తాన్ని నడిపించేది లోకేషే అని కొందరు అంటున్నారంటే ఆయన ఏ రేంజ్‌లో మారిపోయారో అర్ధం చేసుకోవచ్చు. టీడీపీకి భావి సారథిని తానే అని.. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిని కూడా తానేనని నారా లోకేష్ సంకేతాలు ఇస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నారా లోకేష్ - జూనియర్ ఎన్టీఆర్‌ల పేర్లు మరోసారి తెలుగుదేశం వర్గాల్లో, ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. దీనికి కారణం లేకపోలేదు.. జనవరి 23న లోకేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కేడర్ ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించాయి. పార్టీలకు అతీతంగా నేతలతో పాటు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు నారా లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తన బావకు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతా నుంచి తారక్ ట్వీట్ చేశారు. దాంతో బావబామ్మర్దులు ఒక్కటైపోయారా? మళ్లీ నారా ఫ్యామిలీకి ఎన్టీఆర్ దగ్గర కానున్నారా? అంటూ టీడీపీ నేతలు, అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పోస్ట్ ఏపీ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది.


Click it and Unblock the Notifications











