విజయశాంతికి షాక్ .. ఉండమంటారా? పొమ్మంటారా?.. ఊగిపోయిన ఎన్టీఆర్
నందమూరి కళ్యాణ్‌రామ్ నటిస్తోన్న తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అలనాటి నటి, లేడీ అమితాబ్ విజయశాంతి కీలకపాత్ర పోషించారు. బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, సయీ మంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు నటించారు. ఏప్రిల్ 18న అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఏప్రిల్ 12న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. అయితే స్టేజ్ ఉన్న సమయంలో ఆయన కోపంతో ఊగిపోతూ అక్కడి నుంచి వెళ్లిపోబోయారు. అక్కడ ఏం జరిగింది? ఎన్టీఆర్ కోపానికి కారణమేంటీ? ఈ వివరాల్లోకి వెళితే..
ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు స్టార్ హీరోలు వచ్చినప్పుడు వారి అభిమానులు చేసే రచ్చ మామూలుగా ఉండదు. తమ హీరో తప్ప మరొకరు మాట్లాడటం నచ్చదు అన్నట్లుగా గోల గోల చేస్తుంటారు. వారి దెబ్బకు చాలా మంది స్పీచ్‌ను మధ్యలోనే ముగిస్తుంటారు. చాలా మంది హీరోలకు ఇది అనుభవమే. గతంలో అల్లు అర్జున్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ అభిమానులు.. పవన్ , పవన్ అంటూ గట్టిగా అరవడంతో చెప్పను బ్రదర్ అంటూ బన్నీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు చెప్పను బ్రదర్ కామెంట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు.

ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అభిమానులు చేసే రచ్చ మామూలుగా ఉండదు. తారక్ ఎక్కడికి వెళితే అక్కడ సీఎం .. సీఎం అంటూ నినాదాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇది పీక్స్‌కు చేరింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇతర టీడీపీ నేతల పర్యటనలు, కార్యక్రమాల్లో తారక్ ఫ్యాన్స్ హంగామా సృష్టించేవారు. ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం, జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో ప్రదర్శనలు నిర్వహించేవారు.
చంద్రబాబు మాట్లాడుతుండగా ఎన్టీఆర్ సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయడం వంటి ఘటనలు పదే పదే రిపీట్ అయ్యేవి. నేతలు పలుమార్లు ఈ ఘటనలపై అసహనం వ్యక్తం చేసిన ఉదంతాలు కూడా ఉండేవి. అయితే ఎన్టీఆర్ రాజకీయాలపై మౌనంగా ఉంటూ ఫ్యాన్స్‌కు నచ్చచెప్పడానికి ప్రయత్నించేవారు. తాజాగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఈవెంట్‌లో మరోసారి అభిమానులు రచ్చ చేయడంతో ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశారు.
వేదికపైకి వచ్చిన ఇతర సినీ ప్రముఖుల్ని మాట్లాడనివ్వకపోవడం, ఇతరులు మాట్లాడుతుంటే అరుపులు, కేకలతో విసిగించడం వంటి పనులు చేశారు. చివరికి విజయశాంతిని కూడా ఇబ్బంది పెట్టారు. దీంతో ఆమె నవ్వుతూనే అసహనం వ్యక్తం చేశారు. బాబూ నీ ఫ్యాన్స్ ఉత్సాహం ఎక్కువగా ఉందని, భయంకరంగా ఉందని విజయశాంతి కామెంట్ చేశారు. ఆ మాటలతో ఎన్టీఆర్ కోపంతో ఊగిపోయారు. ఉండమంటారా? వెళ్లిపోమంటారా? అంటూ స్టేజ్ దిగి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అయితే విజయశాంతి, కళ్యాణ్‌రామ్‌లు ఎన్టీఆర్‌కు నచ్చచెప్పారు. ఆ తర్వాత ఎన్టీఆర్ అభిమానులు శాంతించడంతో విజయశాంతి తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











