Jr NTR: సింహాద్రి మరో సంచలనం.. టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా!
టాలీవుడ్‌లో కొంత కాలంగా రీరిలీజ్‌లు ఎక్కువగా కనిపిస్తోన్నాయి. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలకు సంబంధించిన పుట్టినరోజునో, మరో ప్రత్యేకమైన రోజునో వాళ్లు వాళ్లు నటించిన సూపర్ హిట్ చిత్రాలను 4K టెక్నాలజీలోకి మార్చి మరోసారి రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలు వచ్చి మంచి ఆదరణను అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ 'సింహాద్రి' కూడా మరోసారి తెరపై సందడి చేయబోతుంది. యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన దీన్ని రీరిలీజ్ చేయబోతున్నారు.
ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన 'సింహాద్రి' మూవీని మే 20వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. దీంతో 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా పేరు మారుమ్రోగిపోతోంది. ముఖ్యంగా ఈ చిత్రాన్ని ప్రపంచంలోనే పెద్ద స్క్రీన్ ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న ఐమాక్స్‌లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక, ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ దాదాపుగా అయిపోయిన విషయం కూడా తెలిసిందే.

'సింహాద్రి' రీరిలీజ్‌ను ఉత్సవంలా జరుపుకోవాలని భావిస్తోన్న నందమూరి అభిమానులు.. ఇప్పుడు మరో సంచలనం సృష్టించారు. అదే.. ఈ సినిమా రీరిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. మే 17వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఫిలిం నగర్ ఏరియాలో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ వేడుక జరగబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి అయ్యాయి. ఇలా గతంలో ఏ సినిమా రీరిలీజ్ సందర్భంగా ఈ తరహా ఈవెంట్లను జరపలేదు. ఇక, ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరు అవుతాడా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే 'సింహాద్రి' మూవీకి సంబంధించిన రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవగా.. చాలా ఏరియాల్లో టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ సహా రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో బుకింగ్స్ కంప్లీట్ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక, ఈ సినిమా నైజాం, వైజాగ్ ఏరియాల్లో దిల్ రాజు విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











