కూలడానికి గుడిసె కాదు పవన్ కళ్యాణ్ కంచుకోట.. హరిహర వీరమల్లుపై ట్రోల్స్‌పై జ్యోతికృష్ణ
ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తీసిన సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేయడం ఇటీవలి కాలంలో కష్టంగా మారుతోంది. పైరసీతో పాట నెగిటివ్ ప్రచారం సినీ పరిశ్రమను దెబ్బకొడుతున్నాయి. హీరోల ఫ్యాన్స్ మధ్య వార్, ఇండస్ట్రీ రాజకీయాలకు సినిమాలు బలైపోతున్నాయి. చిన్నా చితకా హీరోలే కాకుండా స్టార్ హీరోలు నటించిన సినిమాలకు కూడా ఈ ట్రోలింగ్‌ను తట్టుకుని నిలబడలేకపోతున్నాయి. దర్శక నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు పలుమార్లు బహిరంగంగానే ఈ పరిస్ధితిపై ఆవేదన వ్యక్తం చేశారు.
కన్నప్ప ట్రోలర్స్‌కు మంచు విష్ణు వార్నింగ్
కన్నప్ప సినిమాపై ట్రోలింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటానని ఈ చిత్ర హీరో, అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కాచుకుని కూర్చొనే కొందరు వ్యక్తులు ప్రీమియర్ షో తర్వాత అదేపనిగా ట్రోలింగ్‌కు దిగుతుంటారు. ఇలాంటి వారిలో యాంటీ ఫ్యాన్స్ కూడా చేరితే ఆయా సినిమాలపై నెగిటివిటీ తారాస్థాయికి చేరుతుంది. మంచు విష్ణు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంతో ఇకపై చిత్ర పరిశ్రమ ఆయన బాటలో నడిచే అవకాశాలు ఉన్నాయి.

జూలై 24న హరిహర వీరమల్లు విడుదల
లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. నిధి అగర్వాల్, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మించారు. తొలుత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. ఆయన తప్పుకోవడంతో ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.
పలుమార్లు వాయిదాపడ్డ వీరమల్లు
ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా కరోనా లాక్‌డౌన్, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం, తదితర పరిణామాలతో వాయిదా పడుతూ వచ్చింది. రాజకీయాలు, పాలనతో బిజీగా ఉన్నప్పటికీ నిర్మాత ఏఎం రత్నం మీద ఒత్తిడి తగ్గించాలనుకున్న పవన్.. ఎంతో కష్టపడి సినిమాను పూర్తి చేసి రిలీజ్‌కు తీసుకొచ్చారు. జూన్ 12నే వీరమల్లు రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాలతో మరోసారి వాయిదాపడింది. అన్ని పనులు పూర్తి చేసుకుని జూలై 24న వీరమల్లు రిలీజ్ అవుతుందని నిర్మాతలు ప్రకటించారు.
ఏఎం రత్నం ముందే పిచ్చి వ్యాఖ్యలు
వరుస వాయిదాలతో హరిహర వీరమల్లుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. ఈ సినిమా విడుదల కావడం కష్టమే అన్నంతగా దుష్ప్రచారం చేశారు. దీనిపై నిర్మాత ఏఎం రత్నం సైతం ఆవేదన వ్యక్తం చేశారు. పిచ్చిరాతల వల్ల సినిమా బిజినెస్, ఫైనాన్స్ మీద ప్రభావం పడుతుందని తెలిపారు. సినిమా కంప్లీట్ కాదనుకున్నామని, అయినా ఈ సినిమా ఒక చెత్త, అనవసరంగా ప్రమోట్ చేస్తున్నారని ఏఎం రత్నం ముందే ఆ వ్యక్తి వ్యాఖ్యానించాడు. రిలీజైన తర్వాత హరిహర వీరమల్లు సినిమానే మాట్లాడుతుందని, విజయమే వాళ్ల నోరు మూయిస్తుందని ఏఎం రత్నం కౌంటర్ ఇచ్చారు.
హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటతో జూలై 3న హరిహర వీరమల్లు ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా వీరమల్లుపై జరుగుతున్న ట్రోలింగ్‌పై దర్శకుడు జ్యోతికృష్ణ ఫైర్ అయ్యారు. 'కొందరి గురించి మాట్లాడుకుంటున్నా.. వాళ్లెవరో, ఎక్కడ ఉంటారో తెలియదు. కానీ హరిహర వీరమల్లు సెట్స్ పైకి వెళ్లిన నాటి నుంచి నెగిటివ్‌గా మాట్లాడుతూనే ఉన్నారు. సినిమా రాదు.. ఆగిపోయిందని కామెంట్స్ పెడుతున్నారు. సినిమా ప్రారంభమై ఐదేళ్ల అయ్యింది.. రెండు పాండెమిక్స్‌తో అడ్డంకి ఏర్పడినా మేం ఆగకుండా పనిచేసుకుంటూనే ఉన్నాం. ఆ తర్వాత ఎలక్షన్స్.. మంచి రిజల్ట్ వచ్చింది.. పవర్‌స్టార్ 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్‌తో గెలిచారు.. డిప్యూటీ సీఎం అయ్యారు' అని జ్యోతికృష్ణ గుర్తుచేశారు.
పవన్ కంచుకోటను కూల్చలేరు
'అయినప్పటికీ వీరమల్లుపై నెగిటివ్ కామెంట్స్ ఆగలేదు. వాళ్లు రాసే పిచ్చిరాతలు.. నెగిటివ్ కామెంట్స్.. పవర్‌స్టార్ మూవీని ఆపలేవు. కూలిపోవడానికి ఇది చిన్న గుడిసె కాదు.. పవన్ కళ్యాణ్ కంచుకోట. అభిమానులను ఎవ్వరూ ఆపలేరు' అని జ్యోతికృష్ణ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. మంచు విష్ణు దారి చూపించిన నేపథ్యంలో వీరమల్లు యూనిట్ కూడా నెగిటివ్ పబ్లిసిటీ చేసే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని కామెంట్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











