‘ఎన్టీఆర్ లేకపోతే నా పెళ్లి జరిగేది కాదు.. కులాంతర వివాహం కావడంతో అలాంటి సమస్య’
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, నటరత్న నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే స్టార్ డమ్‌ను సంపాదించుకున్నారు. డ్యాన్సులు, ఫైట్స్, డైలాగ్స్, నటన విషయంలో గుర్తింపు తెచ్చుకున్నారు. అచ్చుగుద్దినట్లు తాత పోలికలతో పుట్టడం ఒక వరంగా అభిమానులు చెబుతూ ఉంటారు. ఈ తరంలో నవరసాలను పలికించగల నటుడిగా విమర్శకుల ప్రశంసలు సైతం ఆయన అందుకున్నారు. జీవితంలో ఎన్ని కష్టాలను, ఎత్తుపల్లాలను ఎన్టీఆర్ ఎదుర్కొన్నారు. పడిపోయిన ప్రతీసారి అంతకు రెట్టింపు బలంతో కెరటంలా దూసుకొచ్చారు.
హీరోగా కన్న తన వ్యక్తిత్వంతోనే ఎన్టీఆర్ మరింత ఎత్తుకు ఎదుగుతున్నారు. తన తోటి హీరోలతో పాటు ఇండస్ట్రీలోని అందరితోనూ స్నేహంతో ఉంటారు జూనియర్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోని అందరూ అగ్రనటులతోనూ ఎన్టీఆర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. దివంగత కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమారైతే.. ఎన్టీఆర్ తన తమ్ముడి కన్నా ఎక్కువని చెప్పుకునేవారు. ఆయనతో స్వయంగా తన సినిమాలో ఒక పాట కూడా పాడించుకున్నారు కూడా.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో బాలీవుడ్ నటులు అలియా భట్, అజయ్ దేవగణ్‌లు ఎన్టీఆర్‌తో ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారంటే అతిశయోక్తి కాదు. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగినా.. ఎంతో ఒదిగి ఉంటారు తారక్ . అన్న జానకీరామ్, తండ్రి హరికృష్ణల మరణం తర్వాత.. ఏ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్నప్పటికీ అభిమానులంతా ఇంటికి జాగ్రత్తగా వెళ్లాలంటూ ఖచ్చితంగా చెబుతారు ఎన్టీఆర్. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రాణమిచ్చే వారిలో దిగ్గజ నిర్మాత , వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ కుమార్తె స్వప్నాదత్ ఒకరు.
తండ్రి అడుగుజాడల్లో సినీరంగంలో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన ఆమె అభిరుచిగల ప్రొడ్యూసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆజాద్ సినిమాకు అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన స్నప్న.. అనంతరం సుభాష్ చంద్రబోస్‌కు పూర్తి స్థాయిలో నిర్మాతగా మారు. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ తీస్తూ వచ్చారు. దాదాపు పదేళ్ల తర్వాత నాని హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏవడే సుబ్రమణ్యంను నిర్మించి మంచి హిట్ కొట్టారు స్వప్నాదత్. ఆ వెంటనే మహానటి, సీతారామమ్ ఇప్పుడు కల్పి 2898 ఏడీతో వరుస బ్లాక్‌బస్టర్స్ కొట్టి బడా నిర్మాతగా మారారు.

ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో అనుబంధం, తన వ్యక్తిగత విషయాలపై స్వప్నదత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ లేకపోతే తన పెళ్లి జరిగేది కాదని ఆమె పేర్కొన్నారు. ప్రసాద్ వర్మను ప్రేమించానని అయితే ఈ విషయాన్ని నాన్నకు చెప్పే ధైర్యం లేదని , మా ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో ఆయన ఖచ్చితంగా ఒప్పుకోరనే భయం ఉందన్నారు. అయితే ఈ విషయాన్ని శక్తి సినిమా షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌కు చెప్పానని.. ఆయన ఇలాంటి మేటర్‌లో లేట్ చేయొద్దని , తాను నాన్నతో మాట్లాడతానని మాట ఇచ్చారని స్వప్న వెల్లడించారు.
ఒకరోజు షూటింగ్ ముగిసిన అనంతరం తారక్ ఇంటికి వచ్చి.. నా ప్రేమ విషయాన్ని నాన్నకు చెప్పారని .. ఆ మాట వినగానే నాన్న ఒప్పుకోకపోగా, చాలా సీరియస్ అయ్యారని స్వప్నాదత్ అన్నారు. అయినప్పటికీ ఎన్టీఆర్ నాన్నని ఎంతో కన్విన్స్ చేశారని.. ఎట్టకేలకు నాన్న అంగీకరించడంతో 2010లో ప్రసాద్ వర్మతో తన పెళ్లి జరిగిందని ఆమె గుర్తుచేసుకున్నారు. అలా ఎన్టీఆర్ తన ప్రేమ పెళ్లి విషయంలో ఎంతో సాయం చేశారని స్వప్నాదత్ ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











