Kalki 2898 AD: కల్కి మూవీ టికెట్ రేట్లు భారీగా తగ్గింపు.. ఇండియా వైడ్ అతి చవకగా ప్రభాస్ మూవీ!
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను వసూలు చేస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్‌లో చేరి ప్రభంజనం సృష్టించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తున్నది. వైజయంతీ మూవీస్ బ్యానర్ రూపొందిన ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడానికి నిర్మాత సీ అశ్వినీదత్ సంచలన నిర్ణయం తీసుకొన్నాడు. ఆ నిర్ణయానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఇండియాలోనే లెజెండ్స్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి నటులు, దీపిక పదుకోన్, దిశా పటానీ లాంటి స్టార్ హీరోయిన్లు నటించిన ఈ సినిమాను సుమారుగా 600 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో టికెట్ రేట్లను భారీగా పెంచి థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఎపిక్ సైంటిఫిక్ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. దాంతో రికార్డు కలెక్షన్లు నమోదు అయ్యాయి.

రిలీజ్‌కు ముందు కల్కి సినిమా టికెట్ రేట్లను తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు భారీగా పెంచుకొనేందుకు అనుమతి ఇచ్చాయి. ఈ సినిమా టికెట్లు సింగిల్ థియేటర్‌లో 200 రూపాయలకుపైగా, మల్టీప్లెక్స్‌లో 400 రూపాయలకుపైగా నిర్ణయించారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ధర ఎక్కువైనా ఆన్ లైన్ బుకింగ్ కౌంటర్లలో రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడుపోయాయి.
ఇక ఒక నెల తర్వాత కల్కి సినిమా టికెట్లను గణనీయంగా తగ్గిస్తూ నిర్మాత అశ్వినీదత్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ సినిమా టికెట్స్ ధరను 100 రూపాయలకే అందుబాటులోకి తెచ్చారు. ఇండియా మొత్తం ఇదే ధర ఉంటుంది. ఆగస్టు 2వ తేదీ నుంచి వారం రోజులపాటు ఈ రేట్ అమలులో ఉంటుంది అని తెలిపారు.

కల్కి సినిమాను మరింత మంది సాధారణ ప్రజలు చూసే విధంగా వెసులుబాటు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నాం. ఎపిక్ సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాను అందరికి చూపించాలనే ప్రయత్నం మాది. ఫ్యాన్స్ రిపీట్ ఆడియెన్స్‌గా మారేందుకు అవకాశంగా ఉంటుందని భావిస్తున్నాం అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇదిలా ఉండగా, కల్కి చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ చిత్రం ఇండియాలో 800 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 300 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఇండియాలో పలు సినిమాల రికార్డులను అధిగమించింది.


Click it and Unblock the Notifications











