‘భారతీయుడు 2’ మొదలైంది...
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఇండియన్'(భారతీయుడు)కు సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. 'ఇండియన్-2' పేరుతో తెరకెక్కనున్న ఈ మూవీ త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆర్ట్స్ వర్క్ మొదలైంది. ఆర్ట్ డైరెక్టర్ టి ముత్తురాజ్ సెట్స్ వర్క్ ప్రారంభించారు.
తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన పాపులర్ ఆర్ట్ డైరెక్టర్లలో ముత్తురాజ్ ఒకరు. గతంలో ఆయన గురు, రాజా రాణి, ఐ, పులి, తేరి, రెమో, 2.0తో పాటు 40కి పైగా సినిమాలకు పని చేశారు. మోహన్ లాల్ మూవీ 'గురు' చిత్రానికి గాను ఆయన 1997లో కేరళ ప్రభుత్వం నుంచి బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్నారు.
2.0 రిలీజ్ తర్వాత 'ఇండియన్-2' సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు శంకర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కూడా కీలకమైన పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. నయనతార లేదా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రంలో అజయ్ దేవగన్ విలన్ పాత్ర చేస్తున్నారు. గత ఇంటర్వ్యూలో కమల్ హాసన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇండియన్ మొదటి భాగంలో సీబీఐ ఆఫీసర్ పాత్ర పోషించిన నెడుముడి వేణు రెండో భాగంలోనూ సినిమాలోనూ అదే పాత్రలో కనిపించబోతున్నారట.

2.0 చిత్రాన్ని నిర్మించి 'లైకా ప్రొడక్షన్స్' వారు 'ఇండియన్ 2' చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంలో 2.0 తర్వాత క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











