పద్మ పురస్కారాల్లో టాలీవుడ్‌కు మొండిచెయ్యి.. కంగనా, కరణ్‌లకు పద్మశ్రీ
భారత దేశంలో పద్మ పురస్కారాలకు ఓ విశిష్టత ఉంది. ప్రతీ ఏటా ప్రకటించే ఈ పురస్కారాల్లో సెలెబ్రిటీలే కాక..సామాన్య జనానికి సైతం ఇస్తూ.. వారు సమాజానికి చేసే మంచిని అందరికీ తెలియజేస్తూ వస్తోంది. తాజాగా కేంద్రం ప్రకటించిన జాబితాలో సినీ రంగం నుంచి కేవలం బాలీవుడ్ ప్రముఖులనే వరించింది. టాలీవుడ్‌లోనూ ఎంతో మంది అర్హులైన వారున్నా.. మనవారికి మళ్లీ మొండిచేయి చూపించారు.

ఫైర్ బ్రాండ్ కంగనాకు..
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. ఇటీవలే ఆమె నటించిన పంగా చిత్రం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా.. ఎవరి అండదండలు లేకుండా ఎదిగిన కంగనా ఎన్నో కష్టనష్టాల్ని ఎదుర్కొంది. వెనక్కి తగ్గకుండా నిత్యం పోరాడే తత్త్వం ఉండే ఆమెకు పద్మశ్రీ వరించటంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్పందించిన కంగనా..
భారతదేశ నటిగా తనకు లభించిన గుర్తింపునకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని ప్రతి తల్లికి.. కూతురుకు.. ధైర్యంగా కలల్ని సాకారం చేసుకునే ప్రతి భారత మహిళకు అంకితమిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఏక్తాకపూర్‌కు కూడా..
సినీ రంగం నుంచి నలుగురికి పద్మ అవార్డులు వస్తే..అందులో ఇద్దరు మహిళలుండటం విశేషం. అందులోనూ ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచిన ఇద్దరు మహిళలకే ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రముఖ నిర్మాత అయిన ఏక్తా కపూర్‌ను కూడా పద్మ శ్రీ వరించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు జితేంద్ర.. శోభా కపూర్ దంపతుల ముద్దుల తనయ అయిన ఏక్తా.. బాలాజీ టెలీ ఫిలింస్ సంస్థపై పెద్ద ఎత్తున సినిమాలు.. సీరియల్స్, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్న వైనం తెలిసిందే.
Recommended Video

కరణ్ జోహర్, అద్నాన్ సమీ..
నటన, దర్శకత్వం, నిర్మాత ఇలా ప్రతీ క్రాఫ్ట్‌లో తనదైన ముద్ర వేసిన బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహర్. టీవీ హోస్టుగా, రియాలిటీ షో జడ్జిగా తనలోని మరో కోణాన్ని పరిచయం చేసి ఎందరికో దగ్గరైన కరణ్‌ను పద్మశ్రీ వరించింది. గాయకుడు అద్నాన్ సమీకి సైతం పద్మశ్రీ లభించింది. ఈ సారి పద్మ అవార్దుల్లో టాలీవుడ్ స్కోర్ జీరో. ఎప్పటిలానే కేంద్రం మరోసారి చిన్న చూపు చూసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











