Ranjani Raghavan: తెలుగు తెరకు మరో కన్నడ భామ.. టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం
టాలీవుడ్‌లో పరభాష హీరోయిన్ల హవానే ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మళయాల, తమిళ, కన్నడ పరిశ్రమలకు చెందిన భామలే తెలుగులో దూసుకుపోతుంటారు. వీరి తరువాత ఉత్తరాదికి చెందిన హీరోయిన్లే అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఎక్కడో ఓ మూల తెలుగు అమ్మాయిలకు చిన్న చిన్న చాన్స్‌లు ఇచ్చినా, వచ్చినా.. తెలుగు తెరపై పక్క రాష్ట్రాల అందాలే వెలుగుతుంటాయి.
ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో కన్నడ భామలు తమ సత్తాను చాటుతున్నారు. శ్రద్దా శ్రీనాద్, రష్మిక మందాన్న లాంటి హీరోయిన్లు ప్రతిభను నిరూపించుకుని అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. రష్మిక మందాన్న అయితే ఏకంగా స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే ఫుల్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇస్మార్ట్ బ్యూటీగా అదిరిపోయే నటనను కనబర్చి ఎంతో మంది కుర్రకారు గుండెల్ని పేల్చేసిన నభా నటేష్ కూడా కన్నడ భామే. తాజాగా మరో కన్నడ నటి తెలుగు ప్రేక్షకుల మనసును దోచేందుకు సిద్దమైంది.

పుట్ట గౌరీ మధువే, పౌర్ణమి తింకల్, ఇష్ట దేవతే లాంటి టీవీ సీరియల్స్‌లో పాపులర్ అయిన రంజనీ రాఘవన్.. రాజహంస సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆపై టక్కర్ చిత్రాన్ని చేసిన ఈ భామ.. తెలుగులో పరిచయం అయ్యేందుకు రంగం సిద్దం చేసుకుంది. శ్రీ మాతా క్రియేషన్స్‌పై మహంతేష్ నిర్మిస్తోన్న 'సత్యం' చిత్రానికి అశోక్ కె కడాబా దర్శకత్వం వహిస్తున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభించారు. కేవీ రాజు డైలాగ్స్ అందిస్తుండగా, సినీ టెక్ సూరీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











