కర్ణాటకలో గేమ్ ఛేంజర్‌పై ఆగ్రహ జ్వాలలు.. బహిష్కరించాలంటూ కన్నడ వాసుల ఆందోొళన
కళకు, కళాకారులకు ప్రాంతీయ, భాషా భేదాలు ఉండకూడదని పెద్దలు చెబుతుంటారు. సినీ రంగాన్నే తీసుకుంటే దశాబ్ధాలుగా పరభాషా నటులు ఇతర భాషల పరిశ్రమల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తమ అవకాశాలకు గండికొట్టి , తమను మించిన ఆదాయాన్ని పొందుతున్నారనే అక్కసు స్థానిక కళాకారుల్లో నెలకొంటోంది. టాలెంట్‌నే కొలమానంగా తీసుకుని తాము వారికి అవకాశాలు ఇస్తున్నామని దర్శక నిర్మాతలు సమర్ధించుకుంటూ ఉంటారు.
భారతదేశం విభిన్న సంస్కృతులు, భాషలు, సాంప్రదాయాలు కలగలిసిన దేశం. ఇన్ని వైరుధ్యాలున్నా వేల ఏళ్లుగా అంతా కలిసి మెలిసి జీవిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెబుతున్నారు భారతీయులు . తమ ప్రాంతం, భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలను ప్రేమించడం.. వాటి కోసం అవసరమైతే ఎంత వరకైనా వెళ్తారు కన్నడిగులు. జాతి ప్రయోజనాల విషయంలోనూ అంతే. కావేరీ జలాల విషయంలో తమిళనాడుతో దశాబ్ధాల నుంచి గొడవ పడుతూనే ఉన్నారు.

మొన్నామధ్య వాణిజ్య , వ్యాపార సంస్థల నేమ్ బోర్డులలో 60 శాతం కన్నడ పదాలే ఉండాలంటూ పెద్ద ఆందోళనకు దిగారు. బెంగళూరు నగర పాలక సంస్థ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలంటూ కన్నడ రక్షణ వేదికే ఆందోళనకు దిగింది. కొన్ని వ్యాపార సంస్థలు కావాలనే కన్నడ భాషను నిర్లక్ష్యం చేస్తున్నాయంటూ హోటళ్లు, పలు దుకాణాల బయట ఆంగ్లంలో ఉన్న బోర్డులను నిరసనకారులు ధ్వంసం చేయడంతో అప్పట్లో ఈ వివాదం దుమారం రేపింది.
అలాగే ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించాలంటూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదన కూడా కలకలం రేపింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన కంపెనీలు, వాటి యాజమాన్యాలపై కన్నడిగులు మండిపడ్డారు. దీనికి సినీ తారలు కూడా మద్ధతు పలికారు. సో.. అలా ఉంటదన్న మాట కన్నడిగులతో.
దశాబ్ధాలుగా తెలుగు సినిమాకు కర్ణాటక రాష్ట్రం పెద్ద మార్కెట్‌గా ఉంది. కన్నడ సినిమాలను మించి తెలుగు సినిమాలను అక్కడి ప్రజలు ఆదరిస్తుంటారు. శాండిల్‌వుడ్ తారలతో మన తెలుగు స్టార్స్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ సంక్రాంతికి కూడా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను కర్ణాటకలో భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అలాంటిది తెలుగు సినిమాలకు ఊహించని షాక్ తగిలింది.
కర్ణాటకలోని ఏదైనా గోడలపై తెలుగు సినిమా పోస్టర్లు కనిపిస్తే చాలు ఆ పోస్టర్లను చించేయడం, వాటిపై నల్లరంగు పూసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోస్టర్లు తెలుగులో ఉండటమే కన్నడిగుల నిరసనకు కారణమట. అయితే అంతర్గతంగా భాషా భేదాన్ని వారు తెరపైకి తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి కర్ణాటకలో డబ్బింగ్ సినిమాల నిషేధం ఉంది. ఏ భాషా చిత్రమైనా సరే అదే భాషతో రిలీజ్ చేసుకోవచ్చు. కానీ కర్ణాటకలో అధికార భాష అయిన కన్నడలో మాత్రం డబ్బింగ్ చేయకూడదన్నది కండీషన్. అయితే కొన్ని కన్నడ సంఘాలు ఇప్పుడు తెలుగు పేర్లు ఉండటాన్ని సాకుగా చూపుతూ మన సినిమా పోస్టర్లను చించేస్తూ రాద్ధాంతం చేస్తున్నారు. దీనిపై కన్నడ సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











