‘యువరత్న’ ట్రైలర్ విడుదల: మంచి సందేశంతో రాబోతున్న పవర్ స్టార్
కన్నడంలో వరుస విజయాలు అందుకుంటూ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు పునీత్ రాజ్‌కుమార్. వారసత్వంతో సినిమాల్లోకి ప్రవేశించినా అద్భుతమైన టాలెంట్‌తో ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'యువరత్న' అనే సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ, కరోనా లాక్‌డౌన్ సహా పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లోనే త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది.
విద్యా సంస్థలో ఉన్న లోటుపాట్లను వేలెత్తి చూపడంతో పాటు విద్యార్థులు డ్రగ్స్ బానిసలు అవుతోన్న తీరును చూపిస్తూ తీసిన చిత్రమే 'యువరత్న'. ఈ విషయాన్నే తాజాగా విడుదలైన ట్రైలర్‌లో చూపించారు. స్టూడెంట్స్ చేస్తున్న అసభ్య కార్యకలాపాలను కనుగొనేందుకు కాలేజ్‌లో విద్యార్థిగా జాయిన్ అయిన హీరో.. సమస్యలను ఏ విధంగా పరీక్షరించాడు అనే కథాంశంతో ఈ మూవీ రూపొందినట్లు ఇది చూస్తే అర్థం అవుతోంది. ఇక, ఇందులోనే పోలీస్ ఆఫీసర్ గానూ అతడు కనిపిస్తున్నాడు. అదీ కాక గడ్డంతో మరో లుక్‌తోనూ అతడు దర్శనమిస్తున్నాడు.

ఇక, ఈ ట్రైలర్‌లో పునీత్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. అలాగే, ఎస్ ఎస్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. దీంతో ఇది యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను సంతోష్ అనంద్‌రామ్ తెరకెక్కించాడు. సాయేషా సైగల్ హీరోయిన్‌గా చేస్తోంది. 'KGF' సినిమాను నిర్మించిన హోంబళే ఫిలిమ్స్ సంస్థ దీన్ని కూడా రూపొందించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఇక, ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Click it and Unblock the Notifications











