Kannappa: హార్డ్ డిస్క్ మాయం.. సూత్రదారులెవరో తెలుసు.. నిర్మాతల షాకింగ్ స్టేట్‌మెంట్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్పపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా హిట్ లేక అల్లాడిపోతున్న విష్ణు.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సాలీడ్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా సర్వ శక్తులు ఒడ్డి ఈ సినిమాకు ప్లాన్ చేసి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని నిర్మిస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో కన్నప్ప సినిమాకు సంబంధించి కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డిస్క్‌ను కొందరు ఎత్తుకెళ్లారనే వార్త బయటకు రావడంతో చిత్ర సీమ షాకైంది. ఈ పరిణామాలతో కన్నప్ప చిత్ర నిర్మాణ సంస్ధ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
జూన్ 27న విడుదల కానున్న కన్నప్ప
ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధు, ముఖేష్ రిషితో పాటు మోహన్‌లాల్ , ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టీఫెన్ దేవాస్సే మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. మంచు విష్ణు స్వయంగా కథ, స్క్రీన్ ప్లేను అందిస్తుండటం విశేషం. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

వారిద్దరూ మా ఉద్యోగులు కారు
హార్డ్ డిస్క్ మాయంపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. కొందరు దీనిని పబ్లిసిటీ స్టంట్‌గా కొట్టిపడేశారు. దీంతో చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించింది. కన్నప్పలోని ఇద్దరు నటులపై చిత్రీకరించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు వీఎఫ్ఎక్స్ వర్క్‌కు చెందిన హార్డ్ డ్రైవ్‌ని ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి పంపిస్తుండగా మార్గమధ్యంలోనే ఇది చోరీకి గురైందని నిర్మాణ సంస్ధ తెలిపింది. చరిత అనే మహిళ చెప్పినట్లుగా రఘు అనే వ్యక్తి ఆ పార్శిల్‌కు సంతకం చేసి తీసుకున్నాడని పేర్కొంది. రఘు, చరితలు తమ సంస్థ ఉద్యోగులు కానీ, ప్రతినిధులు కానీ స్పష్టం చేసింది.
కన్నప్పను అడ్డుకునేందుకే
ఈ సంఘటన తాజాగా జరిగింది కాదని, దాదాపు నాలుగు వారాల క్రితమే జరిగిందని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని 24 ఫ్రేమ్స్ తెలిపింది. దీని వెనుక ఎవరున్నారో మాకు, దర్యాప్తు అధికారులకు బాగా తెలుసని.. నిందితులను గుర్తించామని.. వారి ఉద్దేశం ఏంటో కూడా తెలుసని సంస్థ వెల్లడించింది. అంతేకాదని దాదాపు 90 నిమిషాల సినిమా ఫుటేజ్‌ని కూడా ఆన్‌లైన్‌లో లీక్ చేయాలని కుట్ర చేసినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని 24 ఫ్రేమ్స్ పేర్కొంది. కన్నప్ప సినిమాను అడ్డుకునేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నంపై తమ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హుటాహుటిన సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని వెల్లడించింది.
సినిమా వాళ్ల పనే
బయటి వారు కాకుండా పరిశ్రమకు చెందినవారే ఇలాంటి కుట్రకు తెరదీయడం బాధాకరమని.. ఇది వ్యక్తిగత కక్ష సాధింపు కిందకే వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందుతున్న దశలో ఇలాంటి పనులు.. మన పరిశ్రమకే అవమానకరమని 24 ఫ్రేమ్స్ వ్యాఖ్యానించింది. కన్నప్ప చిత్రాన్ని ఓ మైల్ స్టోన్‌గా నిలబెట్టేందుకు ఎంతో మంది కష్టపడుతున్నారని వారిందరికీ తాము అండగా నిలుస్తామని స్పష్టం చేసింది. ఇలాంటి పిరికిపంద చర్యలకు భయపడే ప్రసక్తే లేదని.. ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ ఏదైనా బయటికి వస్తే దానిని ప్రోత్సహించొద్దని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ విజ్ఞప్తి చేసింది.


Click it and Unblock the Notifications











