కపిల్ శర్మ కేఫ్‌పై మరోసారి కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ స్ట్రాంగ్ వార్నింగ్
కెనడాలో గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తాన్ వేర్పాటువాదులు హిందూ ఆలయాలను, ఇతర మతాలకు చెందిన ఆధ్యాత్మిక కేంద్రాలను టార్గెట్ చేస్తున్నారు. ఇక కెనడాలో స్థిరపడిన కొన్ని భారత సంతతి ముఠాలు.. భారతీయులనే టార్గెట్ చేస్తుండటం దురదృష్టకరం.
నిజ్జర్ హత్య తర్వాత భారత్‌పై ట్రూడో ఆరోపణలు
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత నాటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందంటూ నేరుగా ఆరోపణలు చేశారు. భారత్ నుంచి తీవ్రంగా ప్రతిఘటన ఎదురవ్వడంతో ట్రూడో వెనక్కి తగ్గారు. అయినప్పటికీ తన చర్యలతో విమర్శలు కొని తెచ్చుకుంటూనే ఉన్నారు. భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన నిజ్జర్‌కు ఏకంగా పార్లమెంట్‌లోనే నివాళులర్పించడం సంచలనం కలిగించింది.
కెనడాలోని ఖలిస్తానీ గ్యాంగ్‌ల ఆగడాలు
అంతేకాదు.. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా అనుమానితుల జాబితాలో కెనడాలోని భారత హైకమీషనర్ సహా పలువురు దౌత్య సిబ్బంది పేర్లను చేర్చడంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే భారత హైకమీషనర్‌ను రీకాల్ చేసిన కేంద్రం.. ఢిల్లీలోని కెనడా సిబ్బందిని దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. ఈ పరిణామాల మధ్య ట్రూడో అండ చూసుకుని కెనడాలోని భారత సంతతి గ్యాంగ్‌లు, ఖలిస్తానీ ముఠాలు.. హిందూ ఆలయాలు, భారత సంతతి సంస్థలు, వ్యాపారులు, ప్రముఖులను టార్గెట్ చేస్తున్నాయి.

కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు
ఈ క్రమంలో హిందీ బుల్లితెరపై స్టార్ హోస్ట్‌గా వెలుగొందుతున్న కపిల్ శర్మ కెనడాలో ఇటీవల ప్రారంభించిన రెస్టారెంట్‌పై కాల్పులు జరగడం కలకలం రేపింది. గత నెల 10వ తేదీన సర్రేలో ఉన్న కాప్స్ కేఫే గుర్తు తెలియని దుండగులు కాల్పులకు దిగారు. దీంతో లోపల ఉన్న సిబ్బంది ప్రాణ భయంతో వణికిపోయారు. నాటి ఘటనలో కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. పోలీసులు విచారణ జరిపినప్పటికీ ఈ దాడి వెనుక దోషులు ఎవరన్నది తెలియరాలేదు. ఈ పరిస్ధితులతో కేఫేను తాత్కాలికంగా మూసివేశారు కపిల్ శర్మ.
ఈసారి ముంబైలో తేల్చుకుందాం
ఇటీవలే దానిని తిరిగి ప్రారంభించగా.. మరోసారి దుండగులు కాల్పులకు తెగబడటంతో కెనడాలోని భారత సంతతి కమ్యూనిటీ మరోసారి ఉలిక్కిపడింది. కాల్పుల సమయంలో కొందరు సిబ్బంది లోపల ఉన్నారని.. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఏకంగా 25 రౌండ్ల కాల్పులు జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఈ దాడి తమ పనేనని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించింది. తాము అతనికి కాల్ చేశాం.. కానీ అతను స్పందించలేదు.. అందుకే యాక్షన్‌లోకి దిగాల్సి వచ్చిందని అందులో రాసుకొచ్చింది. ఈసారి కూడా స్పందించకుంటే నెక్ట్స్ ముంబైలో చర్యలు తీసుకుంటామని కపిల్ శర్మకు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
కపిల్ శర్మను టార్గెట్ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్
అయితే కపిల్ శర్మను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎందుకు టార్గెట్ చేసింది? డబ్బుల కోసం డిమాండ్ చేసి అతను తిరస్కరించడంతో ప్రతీకార చర్యలకు దిగిందా? లేక కెనడాలోని ఖలిస్తాన్ గ్రూపులు.. బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఇలాంటి పనులు చేయించిందా? అంటూ తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కేఫ్‌పై తొలిసారి దాడి జరిగిన తర్వాత.. నిషేధిత ఉగ్రవాద సంస్థ, ఖలిస్తాన్ వేర్పాటువాద బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ)కి చెందిన ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తోంది. కపిల్ శర్మ షోలో పాల్గొన్న ఓ వ్యక్తి.. నిహాంగ్ సిక్కుల సాంప్రదాయ దుస్తులు, ప్రవర్తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఇది సిక్కుల మనోభావాలను దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించాడు.
తొలి దాడి ఆ ఉగ్రవాద సంస్థ పనే
జూలై 10న తొలిసారి కపిల్ శర్మ కేఫ్‌పై జరిగిన దాడికి తానే బాధ్యత వహిస్తున్నానని బీకేఐ గ్రూప్‌కు చెందిన ఉగ్రవాది హర్జిత్ సింగ్ లడ్డి ప్రకటించాడు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌ని కెనడా ప్రభుత్వం ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. అలాగే భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో లడ్డి ఉన్నాడు. అయితే ఇప్పుడు సీన్‌లోకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎందుకొచ్చింది? కపిల్ శర్మను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











