హిట్ 4 హీరో అతనే .. ఏసీపీ వీరప్పన్‌గా ఎంట్రీ, Hit 3 క్లైమాక్స్‌లో రిపోర్టింగ్!
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్‌హిట్ సినిమాలకు ఎన్నో సీక్వెల్స్‌లు వచ్చాయి. వాటిలో కొన్ని హిట్ అయ్యాయి.. మరికొన్ని ఫట్ అయ్యాయి. అయితే సినిమాలకు సీక్వెల్స్ తీయడం ఆషామాషీ వ్యవహారం కాదు.. ఫస్ట్ పార్ట్‌కు సరైన కొనసాగింపు లేకుండా లింక్ కట్ చేసినట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా ప్రేక్షకులు తిప్పికొడతార. సీక్వెల్స్ కత్తిమీద సాము వంటివని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి లాంటి వారే చెప్పారంటే అర్ధం చేసుకోవచ్చు. అలాంటిది హిట్ పేరిట ఫ్రాంచైజీ క్రియేట్ చేసి దానిని విజయవంతంగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేస్తున్నారు .
తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా, కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన మరో హిట్ ఫ్రాంఛైజీ హిట్ 3. కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమాకు హిట్ టాక్‌తో పాటు పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే హిట్ 4 ఎప్పుడు? హీరోగా ఎవరిని తీసుకున్నారు? అనే ప్రశ్నలు వచ్చాయి. వీటికి హిట్ 3లోనే ఆన్సర్ ఇచ్చారు శైలేష్ కొలను. ఈ వివరాల్లోకి వెళితే..

ప్రపంచవ్యాప్తంగా జరిగిన దాదాపు 300కు పైగా నేరాలను ఐదేళ్ల పాటు క్షణ్ణంగా పరిశీలించి దర్శకుడు శైలేష్ కొలను హిట్ ఫ్రాంఛైజీకి శ్రీకారం చుట్టారు. విశ్వక్‌సేన్‌తో హిట్ కేస్ 1, అడివి శేష్‌తో హిట్ కేస్ 2 సినిమాల్ని తెరకెక్కించి సక్సెస్ కొట్టి తన పేరుకు ఓ బ్రాండ్ తెచ్చుకున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు గ్రంథాలయంలోనే ఎక్కువసేపు గడిపేవారట శైలేష్. దాదాపు ఐదేళ్ల పాటు 300కు పైగా నేరాలు, వాటి పూర్వాపరాలతో పాటు పోలీసులు నేర దర్యాప్తులో వినియోగించే ఫోరెన్సిక్, క్రిమినాలీ విషయాలపైనా అధ్యయనం చేశారు శైలేష్.
కథను రాస్తున్నప్పుడే హీరో ఎవరో డిసైడ్ చేసుకుంటానని శైలేష్ చెప్పారు. అయితే మితిమిరిన రక్తపాతం, హింస తన చిత్రాల్లో ఎక్కువగా ఉన్నాయంటూ వస్తున్న వార్తలను ఆయన పలుమార్లు ఖండించారు కూడా. సినిమాలో సామాజిక కోణం ఉంటుందని .. తాను చెప్పాలనుకున్న సందేశం ప్రజల్లోకి వెళ్లాలని శైలేష్ తెలిపారు. ఇక తాజా హిట్ 3లో చిన్న పిల్లల కిడ్నాప్‌లు, దేశవ్యాప్తంగా జరిగే ఒకే తరహాలో జరిగే హత్యలు, చీకటి ప్రపంచం వంటి అంశాలను డాక్టర్ శైలేష్ కొలను టచ్ చేశారు. థియేటర్‌లో కూర్చొన్నప్పుడే హిట్ 4 ఎప్పుడు? ఎవరితో తీస్తారంటూ ప్రేక్షకుల మనసులో ఓ ప్రశ్న చక్కర్లు కొట్టింది. దీనికి ఎప్పటిలాగే క్లైమాక్స్‌లో ఆన్సర్ ఇచ్చారు దర్శకుడు.
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ హిట్ 4లో హీరోగా కోలీవుడ్ స్టార్ కార్తీని అఫీషియల్‌గా ప్రకటించారు . ఏసీపీ వీరప్పన్‌గా ఆయన స్క్రీన్‌పై కనిపించారు. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అంటూ మహాకవి గురజాడ అప్పారావు కవిత్వాన్ని చెబుతూ ఎంట్రీ ఇస్తారు కార్తీ. ఏసీపీగా ఛార్జ్ తీసుకున్న వీరప్పన్.. త్వరలో రిపోర్ట్ చేస్తారంటూ ముగించారు. అన్నట్లు హిట్ 4లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిగా కార్తీ కనిపించనున్నారు. ప్రస్తుతం హిట్ 3లో కార్తీ ఎంట్రీ సీన్‌కు సంబంధించిన వీడియోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. మరి ఏసీపీ వీరప్పన్ ఇన్వెస్టిగేషన్ చూడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











