KGF Chapter 3 : కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన ప్రొడక్షన్ టీం.. ప్రొడ్యూసర్ అలా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇలా!
కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా నటించిన KGF సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. KGF సినిమాతో యష్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ లభించింది. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన KGF చాఫ్టర్ 2 సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. చాఫ్టర్ 1 కంటే చాప్టర్ 2 గ్రాండ్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమాలో KGF చాఫ్టర్ 3 ఉంటుందని క్లారిటీ ఇవ్వడంతో ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా విషయంలో ఆ వార్తలు నిజం కాదంటున్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఆ వివరాలు

సీక్వెల్ ఉంటుందని
ఒకప్పుడు కన్నడ సినీ పరిశ్రమ నుంచి ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా కన్నడ సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా తెలిసింది మాత్రం KGF సినిమాతోనే అని చెప్పక తప్పదు. యష్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన KGF సినిమా 2018 సంవత్సరంలో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది.. ఈ సినిమాకు వచ్చిన స్పందన చూసి దానికి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే మేకర్స్ ప్రకటించారు..

మరో భాగం
దానికి అనుగుణంగానే సీక్వెల్ మొదలు పెట్టిన తర్వాత కరోనా దేశంలో ఎంటర్ అయింది. క్రమంలోనే అనేక వాయిదాలతో ఎట్టకేలకు ఈ సినిమా సీక్వెల్ KGF 2ని ఏప్రిల్ నెలలో విడుదల చేశారు. ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో విడుదలైన ఈ సినిమా 1,100 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి మరిన్ని కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. అయితే KGF 2 సినిమా చివరిలో ఈ సినిమాకు మరో భాగం ఉంటుందని హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది అని జనం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

35 పర్సెంట్ షూటింగ్
అయితే ఈ KGF 3కి సంబంధించి సినీ నిర్మాత విజయ్ కిరగందూర్ క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు వెల్లువెత్తాయి. తాజాగా దైనిక్ భాస్కర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత విజయ్ కిరగందూర్ KGF 3 మీద క్లారిటీ ఇచ్చారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం 'సలార్' సినిమా పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నాడని, నెక్స్ట్ వీక్ నుంచి లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ కూడా జాయిన్ అవుతారని, ప్రజెంట్ 35 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది, అక్టోబర్ లేదా నవంబర్‌కు షూటింగ్ అంతా కంప్లీట్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.

మార్వెల్ తరహా యూనివర్స్
ఆ తర్వాత 'కెజియఫ్ 3' స్టార్ట్ చేస్తామని, 2024 లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని విజయ్ కిరగందూర్ తెలిపారని అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. కేజీఎఫ్ సీక్వెల్ ద్వారా మార్వెల్ తరహా యూనివర్స్‌ను క్రియేట్ చేయడం కోసం పక్కాగా ప్లానింగ్ చేస్తున్నామని స్పైడర్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్ మాదిరిగా ప్రతి సీక్వెల్ కోసం డిఫరెంట్ క్యారెక్టర్లను డిజైన్ చేస్తామని ఆయన పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది.

అప్పుడే కాదు
అయితే ఇప్పుడు KGF చాప్టర్ 2 సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ KGF చాప్టర్ 3 గురించి తన సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, "ప్రస్తుతం వార్తల్లో తిరుగుతున్నవన్నీ ఊహాగానాలే, చాలా ఉత్తేజకరమైన ప్రాజెక్ట్‌లు మా ముందున్నందున, మేము (హోంబాలే ఫిల్మ్స్) KGF చాప్టర్ 3ని ఇప్పట్లో అయితే ప్రారంభించడం లేదు. మేము ఆ సినిమా కోసం పనిని ప్రారంభించినప్పుడు మేము మీకు ఒక పెద్ద ప్రకటనతోనే అందరికీ తెలియజేస్తాము అని చెప్పుకొచ్చారు. అయితే నిర్మాత ఒకలా ఎగ్జిక్యూటివ్ నిర్మాత మరోలా చెప్పడంతో ఇందులో ఎవరి మాట నమ్మాలో అర్థం కావడం లేదని అంటున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











