Karthikeya 2 మరోసారి వాయిదా.. ఇంకో కారణం చెప్పిన నిఖిల్!
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటించిన కార్తికేయ 2 మరోసారి వాయిదా పడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదివరకే మూడుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వాయిదా పడుతూ ఉండడంతో అనేక రకాల రూమర్లు వైరల్ అయ్యాయి. అయితే నిఖిల్ మాత్రం ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి సినిమా వాయిదా వేయడానికి గల కారణాలు కూడా తెలియజేశారు. నిఖిల్ ఎలాంటి వివరణ ఇచ్చాడు అనే వివరాల్లోకి వెళితే..

భారీ స్థాయిలో
2014లో వచ్చిన కార్తికేయ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చందు మొండేటి దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఆ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ కలర్ స్వాతి జంటగా నటించారు. మిస్టరీ థ్రిల్లర్ గా తెరపైకి వచ్చిన ఈ సినిమా కథకు సీక్వెల్ రానుంది అని గతంలోనే దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఇక మొత్తానికి మళ్లీ ఇప్పుడు కార్తికేయ ఏ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

పాన్ ఇండియా మూవీగా
అయితే ఈసారి నిర్మాతలు కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా మూవీగా సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ద్వారక బ్యాక్ డ్రాప్ లో ఒక సరికొత్త మిస్టరీని చాలా ఇంట్రెస్టింగ్ గా దర్శకుడు ఈ సినిమాను తెరపైకి పైకి తీసుకువచ్చాడు అని ఈ సినిమాలో భక్తి కోణంలో కూడా ఒక సైన్స్ దాగి ఉంటుంది అని ఎవరిని నొప్పించకుండానే సినిమాను తెరకెక్కించినట్లు నిఖిల్ వివరణ ఇచ్చాడు.

అప్పుడే విడుదలవ్వాల్సింది
ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ఓ వర్గం ప్రేక్షకుల్లో అయితే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. మొదట కార్తికేయ 2 సినిమాను జూలై 22వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు థాంక్యూ సినిమా విడుదల అవుతూ ఉండడంతో మళ్ళీ ఆగస్టు 5వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అదే తేదీన వైజయంతి మూవీస్ నిర్మించిన సీతారామం విడుదలవుతోంది. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ బిగ్ బడ్జెట్ మూవీ బింబిసార కూడా భారీ స్థాయిలో విడుదలవుతోంది అని కార్తికేయ సినిమాను మరొక డేట్ కు షిఫ్ట్ చేశారు.

ఇంటర్వ్యూలో ఎమోషనల్
అయితే కార్తికేయ 2 సినిమా విషయంలో కొంత రాజకీయాలు నడుస్తున్నాయని నిఖిల్ కు బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టే కావాలని వెనక్కి పంపినట్లుగా కూడా కామెంట్స్ అయితే వినిపించాయి. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ కూడా తన సినిమానే అలా వరుసగా వాయిదా వేయడంతో చాలా బాధగా అనిపించింది అని చాలా ఏడ్చినట్లు కూడా తెలియజేశాడు.

మళ్ళీ డేట్ మారింది
ఇక మొత్తానికి ఆగస్టు 12వ తేదీన విడుదల కాబోతోంది అని బలంగా చెప్పినప్పటికీ.. ఇప్పుడు ఆ డేట్ కు సినిమా రావడం లేదు అని నిన్నటి నుంచి ఒక టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు చిత్ర యూనిట్ సభ్యులు అఫీషియల్ గా మరొక క్లారిటీ ఇచ్చారు. సినిమాను ఆగస్టు 13వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించి మరీ తెలియజేశారు.

క్లాష్ కాకూడదని..
అయితే ఈ విషయంలో మళ్ళీ ఎక్కువగా రూమర్లు రాకుండా నిఖిల్ ఒక కారణమైతే చెప్పాడు. అన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించాలి కలెక్షన్స్ రావాలి కాబట్టి ఒక మంచి స్నేహం భావంతోనే ఈ సినిమాను ఒకరోజు ఆలస్యంగా విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. ఆగస్టు 12వ తేదీన నితిన్ మాచర్ల నియోజకవర్గం విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇక క్లాష్ అవ్వకుండా ఉండేందుకే తమ సినిమాను ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. మరి కార్తికేయ 2 ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











