తండ్రైన విక్కీ కౌశల్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్
టాలీవుడ్ టూ బాలీవుడ్ స్టార్ కపుల్స్ ఒక్కొక్కరిగా శుభవార్తలు చెబుతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి, పరిణితి చోప్రా - రాఘవ్ చద్దాలు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఇటీవలే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ - ఉపాసన కొణిదెల దంపతులు తాము రెండోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా ప్రకటించి మెగా కుటుంబానికి పండుగ తీసుకొచ్చారు. తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. కత్రినా పండంటి బాబుకు జన్మనిచ్చారు.
కత్రినాతో అలా పరిచయం
విక్కీ కౌశల్‌కు, కత్రినా కైఫ్‌కు మధ్య పరిచయం విచిత్రంగా జరిగింది. వీరిద్దరూ ఒక్క సినిమాలోనూ కలిసి నటించకుండానే ప్రేమలో పడ్డారు. అలాగే కత్రినా కంటే విక్కీ ఐదేళ్లు చిన్నవాడు. అయినప్పటికీ ఇద్దరి మనసులు కలిసి కొన్నాళ్లు డేటింగ్ తర్వాత పెద్దల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. 2021 డిసెంబర్ 9న రాజస్థాన్ వేదికగా కత్రినా, విక్కీ కౌశల్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లియినప్పటి నుంచి కత్రినా గర్భం దాల్చారంటూ పలుమార్లు ఊహాగానాలు వినిపించాయి.

కత్రినా ప్రెగ్నెన్సీపై గాసిప్స్
అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో కత్రినా కైఫ్ గర్భం దాల్చినట్లుగా పెద్దఎత్తున గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఆమె పొట్ట భాగం ముందుకు వచ్చి బేబి బంప్‌తో ఉండగా.. ఫోటో షూట్ నిర్వహించడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. దాంతో ఈసారి మాత్రం కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ దంపతులు మౌనం వీడారు. తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో బాలీవుడ్ వర్గాలు, అభిమానులు ఈ దంపతులకు విషెస్ తెలియజేశారు. పెళ్లయిన దాదాపు నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందడంతో ఇరు కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి.
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా
తాజాగా నవంబర్ 7వ తేదీన కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లుగా విక్కీ కౌశల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. మా జీవితంలో ఆనందం రెట్టింపు అయ్యింది. అపారమైన ప్రేమ, కృతజ్ఞతతో మా బాబును స్వాగతిస్తున్నామని, మా బిడ్డకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలని పోస్ట్ చేశారు. దాంతో సినీ ప్రముఖులు, అభిమానులు విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఛావాతో బ్లాక్ బస్టర్ హిట్
ఇక.. సినిమాల విషయానికి వస్తే.. కత్రినా కైఫ్ చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చివరిసారిగా 2024లో మేరి క్రిస్మస్ అనే చిత్రంలో ఆమె నటించారు. ఆ తర్వాత పూర్తిగా భర్త, కుటుంబంతో గడిపేందుకే ఆమె సమయాన్ని కేటాయిస్తున్నారు. విక్కీ కౌశల్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథ ఆథారంగా తెరకెక్కిన ఛావాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న విక్కీ కౌశల్ ప్రస్తుతం లవ్ అండ్ వార్ సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవికాక విక్కీ కౌశల్‌తో సినిమాలు తీసేందుకు బడా నిర్మాణ సంస్థలు క్యూకడుతున్నాయి.


Click it and Unblock the Notifications











