ఎట్టకేలకూ బుల్లితెరపై కేజీఎఫ్ ప్రీమియర్.. జూలై 5న గ్రాండ్‌గా
కేజీఎఫ్: ఛాప్టర్ 1 చిత్రం ప్రీమియర్ తెలుగు బుల్లితెరపై గ్రాండ్‌గా ప్రసారం కాబోతున్నది. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రీమియర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రం రిలీజై రెండేళ్లు అయినప్పటికీ తెలుగు టెలివిజన్‌పై ప్రసారం కాకపోవడానికి అనేక కారణాలు వినిపించాయి. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్‌కు ఎలాంటి బజ్ లేకపోవడంతో బిజినెస్ అంతగా జరగలేదు. రిలీజ్ తర్వాత అనూహ్య విజయం సాధించడంతో టెలివిజన్ శాటిలైట్ హక్కుల కోసం భారీగా పోటీ పడ్డారు. అయితే కేజీఎఫ్ సీక్వెల్ రానుండటంతో రెండు శాటిలైట్ల బిజినెస్ ఒక్కసారిగా చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు.
ఇదిలా ఉండగా, కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మాతలకు తెలియకుండా ఓ కేబుల్ టెలివిజన్ చానెల్ ప్రసారం చేయడం వివాదంగా మారింది. సదరు టెలివిజన్ ఛానెల్‌పై నిర్మాతలు కేసు నమోదు చేశారు. దాంతో బిజినెస్ కాస్త లేటు అయిందనే వార్త కూడా వినిపించింది. ఇక కేజీఎఫ్ 2తో కలిపి బిజినెస్‌ను ముగించాలని ప్రయత్నాల నేపథ్యంలో కరోనావైరస్ ఎఫెక్ట్ మొదలైంది. ఈ క్రమంలో కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్‌పై అనేక అనుమానాలు నెలకొనడం, పలుమార్లు సినిమా రిలీజ్ వాయిదా పడటం తెలిసిందే.

ఈ క్రమంలో కేజీఎఫ్ చాప్టర్ 1 బిజినెస్‌ను స్టార్ మా ఛానెల్‌తో పూర్తి చేశారు. దాంతో ఈ సినిమాకు ఆదివారం జూలై 5న మోక్షం లభించింది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. కేజీఎఫ్ చాప్టర్ 1 మీ టెలివిజన్‌లో రాబోతున్నది. తప్పక చూసి ఆదరించాలని కోరారు.


Click it and Unblock the Notifications











