Toofan Lyrical Video: కేజీఎఫ్ నుంచి తుఫాన్.. కిక్కిచ్చే న్యూస్ చెప్పిన యూనిట్
కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చి దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 1'. స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించాడు. ఏమాత్రం అంచనాలు లేకున్నా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అన్ని చోట్లా సూపర్ డూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా ఉత్తరాదిలో ఇది భారీ కలెక్షన్లను రాబట్టింది. అంతేకాదు, కొన్ని జాతీయ అవార్డులను సైతం అందుకుంది. దీంతో కేజీఎఫ్ మూవీ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది.
'కేజీఎఫ్ చాప్టర్ 1' అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో దీనికి సీక్వెల్‌ను తీయాలని చిత్ర యూనిట్ అప్పుడే డిసైడ్ అయింది. అందుకు అనుగుణంగానే 'కేజీఎఫ్ చాప్టర్ 2' పేరిట దీన్ని మొదలు పెట్టేశారు. మొదటి భాగంలో కేజీఎఫ్ మొత్తాన్ని తన వశం చేసుకున్న రాఖీ భాయ్‌కు అధీరా రూపంలో ప్రధాన ప్రత్యర్థి రావడంతో ఈ కథ ప్రారంభం అవుతుంది. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి పోరాటం జరిగింది అనే నేపథ్యంతో దీన్ని రూపొందించారు. ఇందులో రాఖీ భాయ్ హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేసి చూపిస్తారట. ఆరంభం నుంచే ఈ చిత్రంపైన కూడా అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

వాస్తవానికి 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అయినా.. అనివార్య కారణాలతో అనుకున్న సమయానికి టాకీ పార్ట్‌ను పూర్తి చేయలేకలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో దీన్ని పూర్తి చేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టారు. వీటికి సంబంధించిన అన్ని రకాల వర్క్స్‌ను ఇప్పటికే దాదాపుగా కంప్లీట్ చేసేశారు. దీంతో ఈ సినిమాను గత ఏడాదే డిసెంబర్‌లోనే విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని 2022, ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
'కేజీఎఫ్ చాప్టర్ 2' విడుదలకు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో.. ఈ మూవీ ట్రైలర్‌ను మార్చి 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇక, ఇప్పుడు దీని నుంచి మొదటి పాటను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. 'తుఫాన్' అంటూ సాగే ఈ పాటను మార్చి 21వ తేదీ అంటే వచ్చే సోమవారం ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. చాలా మంది పిల్లలు స్టైలిష్‌గా నిల్చుని కనిపిస్తున్నారు. దీంతో ఈ పాటపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి.
క్రేజీ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ టీజర్ నేషనల్ రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక, ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. వీళ్లతో పాటు పలు పరిశ్రమలకు చెందిన ఎంతో మంది నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.


Click it and Unblock the Notifications











