అఫీషియల్: కెజిఎఫ్ దర్శకుడితో మైత్రి మూవీ మేకర్స్ మూవీ
'కెజిఎఫ్' మూవీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు సౌత్ ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతోంది. ఇతడితో సినిమాలు తీసేందుకు బడా నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. తాజాగా ఈ దర్శకుడితో ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీ మేకర్స్' ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
నేడు(జూన్ 4) ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో అతడిని విష్ చేస్తూ 'మైత్రి మూవీ మేకర్స్' పోస్ట్ పెట్టింది. తద్వారా త్వరలో తమ కాంబినేషన్లో సినిమా ఉండబోతోంది అనే హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ దర్శకుడు 'కెజిఎఫ్ చాప్టర్ 2' తీసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మైత్రి సంస్థతో కలిసి సినిమా చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'కెజిఎఫ్-1' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కన్నడ సినీ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటి వరకు అక్కడ వంద కోట్ల రికార్డు కూడా ఒక్కటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసిన చరిత్ర సృష్టించింది.

మార్చిలో కెజిఎఫ్ 2 షూటింగ్ మొదలైంది. విజయ్ కిరంగదూర్ నిర్మాత నిర్మిస్తున్న ఈ మూవీ మొదటి భాగంలో మొత్తం కన్నడ స్టార్సే కనిపించారు. రెండో భాగంలో బాలీవుడ్ స్టార్లు కూడా భాగం కాబోతున్నారని టాక్. ఇందిరా గాంధీ పాత్రలో రవీనా టండన్ ఎంపికైనట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











