Kiara- Sidharth: తండ్రైన సిద్ధార్ధ్ మల్హోత్రా.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ
బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ- సిద్ధార్ధ్ మల్హోత్రా దంపతులు తల్లిదండ్రులయ్యారు. కియారా అద్వానీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రిలో ఆమెకు డెలివరీ జరిగినట్లు బాలీవుడ్ మీడియా తెలిపింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో బాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు కియారా - సిద్ధార్ధ్ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఈ దంపతులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఫగ్గీ సినిమాతో ఎంట్రీ
ఫగ్లీ సినిమాతో 2013లో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు కియారా అద్వానీ. ఆ తర్వాత లెజండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ బయోపిక్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన నటించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అనంతరం మెషిన్, లస్ట్ స్టోరీస్, కళంక్, కబీర్ సింగ్, గుడ్ న్యూజ్, గుల్టీ, లక్ష్మీ, ఇందూకీ జవానీ, షేర్షా, భూల్ భూలయా 2, గోవింద నామ్ మేరా, సత్యప్రేమ్ కీ కథ వంటి సినిమాలతో బాలీవుడ్‌లో నిలదొక్కుకున్నారు కియారా అద్వానీ.
సౌత్‌లోనూ కియారా బిజీ
బాలీవుడ్‌లో బిజిగా ఉన్నప్పటికీ సౌత్‌లోనూ పాగా వేయాలని ఈ ముద్దుగుమ్మ తెలివిగా కెరీర్ ప్లాన్ చేసుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను అనే చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు కియారా అద్వానీ. తర్వాత రామ్‌చరణ్‌తో వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ యశ్ సరసన కన్నడంలో టాక్సిక్, హృతిక్ రోషన్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతోన్న వార్ 2లో నటిస్తున్నారు కియారా.
సిద్ధార్థ్‌తో ప్రేమ, పెళ్లి
కాగా.. షేర్షా సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాతో కియారా పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయాన్ని బయటపెట్టకుండా సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించింది ఈ జంట. అలాంటిది ఓ రోజున తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు కియారా - సిద్ధార్ధ్ మల్హోత్రా. ఇరు కుటుంబాల అంగీకారంతో 2023 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఉన్న సూర్యఘర్ ప్యాలస్‌లో సిద్ధార్థ్ - కియారాల వివాహం అట్టహాసంగా జరిగింది. నాటి నుంచి ఫారిన్ ట్రిప్‌లు, వెకేషన్స్‌తో ఈ జంట బిజీగా మారిపోయింది. సినిమా ఈవెంట్స్, ఫంక్షన్లలో పాల్గొంటూ బాలీవుడ్‌లోని స్టార్ కపుల్స్‌లో ఒకటిగా నిలిచింది. పెళ్లయినప్పటికీ కియారా సినిమాలలో నటిస్తూనే వస్తున్నారు. ప్రస్తుతం సిద్ధార్ధ్ మల్హోత్రా .. పరం సుందరి, వీ వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ సినిమాలలో నటిస్తున్నారు.
నెల ముందే డెలివరీ
ఇక తమ కంటే వెనుక పెళ్లయిన వారు కూడా శుభవార్తలు చెబుతుండగా .. రెండేళ్లు కావొస్తున్నా గుడ్ న్యూస్ చెప్పకపోవడంతో ఇరు కుటుంబాలు, అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇలాంటి దశలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న భర్త సిద్ధార్ధ్ చేతిలో చేయి వేసి, చేతిలో బేబీ సాక్స్‌తో ఉన్న ఫోటోను కియారా షేర్ చేసి తాను గర్భం దాల్చినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రెగ్నెంట్ అయినప్పటికీ షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొని శెభాష్ అనిపించుకున్నారు. ఆసుపత్రికి రెగ్యులర్ చెకప్‌కు వెళ్తూ, జాగ్రత్తలు తీసుకుంటున్నారు కియారా అద్వానీ. ఆగస్టులో కియారాకు డెలివరీ డేట్ ఇచ్చినట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే నెల ముందుగానే ఆమె డెలివరీ కావడంతో అభిమానులు తొలుత కంగారు పడినా తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications











