Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి కొత్త ట్యాగ్ లైన్ .. ఆ హీరో ఫ్యాన్స్ నుంచి సెగ తప్పదా?
కళాకారులకు బిరుదులు ఉండటం నాటక రంగం నుంచి వస్తున్న ఆనవాయితీ. సినీనటులుకు కూడా అదే సాంప్రదాయం కొనసాగుతోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఇది కంటిన్యూ అవుతుంది. హీరోలే కాదు.. హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలకు కూడా ఇలాంటి బిరుదులు, ట్యాగ్‌లైన్స్ ఇస్తున్నారు అభిమానులు. పాతతరంలో నటరత్న, నటసామ్రాట్, నటశేఖర, నటభూషణ, రెబల్ స్టార్, సూపర్‌స్టార్, మెగాస్టార్ ఇందులో కొన్ని. కొందరికీ ఒకటికి మించి ట్యాగ్‌లైన్స్ ఉండేవి .
హీరోకొక ట్యాగ్‌లైన్
ఇక ఈ ఆధునిక తరంలో యంగ్‌టైగర్, యంగ్ రెబల్‌స్టార్, ప్రిన్స్, పవర్‌స్టార్, ఎనర్జిటిక్ స్టార్, మెగా పవర్‌స్టార్, స్టైలీష్ స్టార్, ఐకాన్ స్టార్ వంటి ట్యాగ్‌లైన్స్ వచ్చి చేరాయి. వీటిని కొంతమందికి అభిమానులు పెడితే.. ఇంకొంతమందికి ఆయా సంస్థలు, మీడియానో ఇస్తుంటుంది. ఇంకొందరు స్టార్స్ తమకు తామే ఈ ట్యాగ్‌లైన్‌లను ఇచ్చుకుంటూ ఉంటారు. కొత్త ట్యాగ్‌లైన్‌తో ఉన్న టైటిల్ కార్డును స్క్రీన్‌పై రిలీజ్ చేసి షాకిస్తుంటారు.

స్వయంకృషితో స్టార్‌గా విజయ్ దేవరకొండ
స్వయంకృషి, తన ప్రతిభతో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు విజయ్ దేవరకొండ. తనదైన నటన, స్టైల్, యాక్షన్‌తో యువతలో ప్రత్యేకంగా అభిమానాన్ని సంపాదించుకున్నారు విజయ్. కుండబద్ధలు కొట్టినట్లు ఏ విషయాన్ని అయినా మాట్లాడటం, మనసులో ఏది దాచుకోకపోవడం, అరుదైన వ్యక్తిత్వంతో యూత్ ఐకాన్‌గా నిలిచారు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, గీతా గోవిందం సినిమాలతో లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా అనిపించుకున్న విజయ్‌కి అర్జున్ రెడ్డి చిత్రం మాస్ ఫాలోయింగ్‌ను తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాతి నుంచి ఆయనను రౌడీ బాయ్, రౌడీ స్టార్ అని కుర్రాళ్లు పిలవడం మొదలుపెట్టారు.
ది ట్యాగ్ చుట్టూ విమర్శలు
అయితే లైగర్ సినిమా సమయంలో తన పేరుకు ముందు ది అనే ట్యాగ్ ఉపయోగించడం విమర్శలకు దారి తీసింది. దీనిపై విజయ్ వెంటనే వివరణ ఇచ్చుకున్నారు. నా పేరుకు ముందుకు ఏదో ఒక ట్యాగ్ ఉండాలని అభిమానులు, దర్శక నిర్మాతలు ప్రయత్నించారని.. అది తనకు ఇష్టం లేదని అయితే లైగర్ యూనిట్ తనకు ది అనే పదాన్ని జోడించడం, అది ఏ హీరోకి లేకపోవడంతో దానిని అంగీకరించానని విజయ్ దేవరకొండ తెలిపారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో వెంటనే ఆ ట్యాగ్ తీసేయమని సూచించానని ఆయన వెల్లడించారు. యూనివర్సల్ స్టార్ నుంచి పీపుల్స్ స్టార్ వరకు చాలా మందికి ట్యాగ్స్ ఉన్నాయని.. నా కన్నా సీనియర్లు, జూనియర్లు ఎన్నో ట్యాగ్స్ వాడుతున్నారని.. ఏ ట్యాగ్ లేకుండా ఉన్న హీరోని నేనొక్కిడినే అంటూ విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
విజయ్ దేవరకొండకి కొత్త ట్యాగ్
తాజాగా విజయ్ దేవరకొండ నటించిన చిత్రం కింగ్డమ్. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ కింగ్డమ్ మూవీని నిర్మించారు. పలు వాయిదాల తర్వాత జూలూ 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా టైటిల్ కార్డ్స్‌లో విజయ్ దేవరకొండకు కొత్త ట్యాగ్ లైన్ వచ్చి చేరింది. యంగ్ టైగర్ విజయ్ దేవరకొండాస్ కింగ్డమ్ అని టైటిల్ కార్డ్ పడింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కొందరు దీనిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ట్యాగ్‌లైన్ వైరల్‌గా మారింది.
ఆ హీరో ఫ్యాన్స్ ఊరుకుంటారా?
అయితే ఈ యంగ్ టైగర్ అన్న ట్యాగ్‌లైన్‌ను గతంలో జూనియర్ ఎన్టీఆర్ వాడేవారు. ప్రస్తుతం ఆయనను అభిమానులు మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ అని పిలుచుకుంటున్నారు. దీంతో ఈ యంగ్ టైగర్ ట్యాగ్‌ను కింగ్డమ్ మేకర్స్.. విజయ్ దేవరకొండకి తగిలించినట్లుగా వార్తలు వస్తున్నాయి. తమ హీరో ట్యాగ్‌ను వాడుకోవడంపై ఎన్టీఆర్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు? మరోసారి సోషల్ మీడియాలో విజయ్‌పై ట్రోలింగ్ తప్పదా? అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











