ఆ హీరో అడగలే.. భాగ్యశ్రీని కావాలనే నేను పెట్టుకొన్నా.. నాగవంశీ
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ముక్కుసూటిగా ఉంటారు. ఏ విషయంపై అయినా కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడటం ఆయన స్టైల్. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే నాగవంశీ.. ప్రెస్‌మీట్లు, ఈవెంట్స్‌లో మైక్ అందుకున్నారంటే ఊగిపోతారు. తనపై ట్రోలింగ్ జరిగినా పట్టించుకోకుండా సితార బ్యానర్‌పై వరుసపెట్టి సినిమాలు చేస్తూ బడా ప్రొడ్యూసర్స్‌లో ఒకరిగా నిలిచాడు నాగవంశీ. తాజాగా కింగ్‌డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ వివరాల్లోకి వెళితే..
కింగ్‌డమ్‌పై రౌడీ స్టార్ ఆశలు
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం కింగ్‌డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సత్యదేవ్, కౌశిక్ మెహతాలు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. గిరిష్ గంగాధరన్, టీ జాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు.

4 సార్లు వాయిదాపడ్డ కింగ్‌డమ్
ఇప్పటికే పలుమార్లు కింగ్ డమ్ మూవీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. తొలుత మే 30, తర్వాత జూలై 4, జూలై 25 తేదీలలో ఈ చిత్రం విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ ఫైనల్‌గా జూలై 31కి ఫిక్స్ అయ్యింది. మ్యూజిక్, రీ రికార్డింగ్ తదితర పనులు పెండింగ్‌లో ఉండటంతో పాటు కొన్ని కారణాల వల్ల కింగ్‌డమ్ వాయిదా పడినట్లు ఫిలింనగర్‌లో పుకార్లు చక్కర్లు కొట్టాయి. నాలుగు రోజుల్లో కింగ్‌డమ్ రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా తిరుపతిలో జూలై 26న కింగ్‌డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
నాకు భాగ్యశ్రీ నచ్చేసింది
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సహా చిత్ర యూనిట్ ఈ కార్యక్రమానికి హాజరైంది. స్టార్ యాంకర్ సుమ కనకాల ఈ ఈవెంట్‌ను హోస్ట్ చేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో సందడి చేసే సుమ.. ఈసారి కూడా నాగవంశీని ఇంటర్వ్యూ చేసింది. ఒకవేళ కింగ్‌డమ్‌లో మీరే హీరో అయితే హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారని సుమ ప్రశ్న సంధించింది. దీనికి నాగవంశీ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. తనకు నచ్చడం వల్లే భాగ్యశ్రీ బోర్సేని ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నానని చెప్పారు. విజయ గారికి, గౌతమ్ గారికి కూడా చెప్పలేదు.. వాళ్లు కూడా తనను అడగలేదన్నారు. భాగ్యశ్రీ బాగా నచ్చడంతో తానే హీరోయిన్‌గా తీసుకున్నానని.. ఒకవేళ నేను హీరో అయితే జనం సినిమా చూడరు కాబట్టి విజయ్ గారిని పెట్టుకున్నానని నాగవంశీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భాగ్యశ్రీకి హిట్ కంపల్సరి
ఇకపోతే.. హీరోయిన్ భాగ్యశ్రీకి ఈ సినిమా హిట్ కొట్టడం అత్యంత కీలకం. తొలి సినిమా మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ కావడంతో ఆమెపై ఓ ముద్ర పడింది.. అయినప్పటికీ తన అందంతో వరుస ఆఫర్లు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. కింగ్‌డమ్‌తో పాటు రామ్ పోతినేని సరసన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో భాగ్యశ్రీ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











