విజయ్ దేవరకొండ వాళ్ల నోళ్లు మూయిస్తాడు.. నిర్మాత నాగవంశీ మాస్ వార్నింగ్
గత కొంతకాలంగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపులతో సమమతం అవుతున్నారు. ఆయన గత చిత్రాలు లైగర్, ది ఫ్యామిలీ స్టార్, ఖుషీలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి. ఈసారి రేసులో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. విజయ్ దేవరకొండ తాజాగా నటించిన మూవీ కింగ్‌డమ్. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా హీరో విజయ్ దేవర కొండపై జరుగుతున్న ట్రోలింగ్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు.
100 కోట్ల బడ్జెట్‌తో కింగ్‌డమ్
కింగ్‌డమ్ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సత్యదేవ్, కౌశిక్ మెహతాలు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. గిరిష్ గంగాధరన్, టీ జాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు.

పలుమార్లు కింగ్‌డమ్ వాయిదా
తొలుత ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. తర్వాత అది జూలై 4కి మారింది. అయితే ఆ సమయంలో పహల్గమ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, భారత్ - పాకిస్తాన్ యుద్ధం కారణంగా మరోసారి కింగ్‌డమ్ వాయిదా పడింది. అనంతరం జూలై 25న సినిమా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీనికి ముందురోజున పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుండటంతో కింగ్‌డమ్ ఆరోజైనా వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరికి అభిమానులు ఊహించినట్లుగానే కింగ్‌డమ్ మరోసారి వాయిదాపడి జూలై 31న కొత్త డేట్ వచ్చింది.
విజయ్ దేవరకొండపై కేసు
కాగా.. విజయ్ దేవరకొండ ఇటీవల తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మనసులో ఏమున్నా కుండబద్ధలు కొట్టడం ఆయన శైలి. ఇదే ఇప్పుడు వివాదాలకు కారణమవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. పాతకాలంలో ఆటవికులు, గిరిజనుల మాదిరిగా భారత్ - పాకిస్తాన్ కొట్టుకుంటున్నాయని చెప్పడంతో ఆయా వర్గాలు విజయ్‌పై ఫిర్యాదు చేశాయి. ఇటీవల ఆయన పేరుకు ముందు ది అన్న ట్యాగ్ పై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. దీంతో ఇతర హీరోలతో పాటు వారి అభిమానులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తన పేరు ముందున్న ది అన్న ట్యాగ్ తొలగించినట్లు విజయ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
నాగవంశీ ఆగ్రహం
తాజాగా విజయ్ దేవరకొండపై ట్రోలింగ్‌పై కింగ్‌డమ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'విజయ్ గారిని జనం ఎందుకు టార్గెట్ చేస్తారో తెలియదు. అసలు ఆయనే చాలా డౌన్‌లో ఉన్నారు, మొన్న రెట్రో ఈవెంట్‌లో చిన్న మాటంటే దానిని హంగామా చేసేశారు. నిన్న ఇంటర్వ్యూలో ఏదో చెబితే దానిని ఇంకోలా డైవర్ట్ చేశారు. ఎందుకు ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు? ఏం అవసరం? యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఏదో మాట్లాడాడు అంటే అర్ధముంది. ఈ మధ్య ఆయన ఏం మాట్లాడటం లేదు. ఆఫ్ కెమెరా విజయ్ గారిని కలిసి మాట్లాడితే, ఈయనేనా అలా మాట్లాడింది అనిపిస్తుంది. జనానికి జాలి కూడా లేదు హీరో మీద. హిట్స్ లేక బాధపడుతుంటే ఆయనేం మాట్లాడినా భూతద్దంలో చూసి కాంట్రవర్సీ చేస్తున్నారు. వీటన్నింటినీ దాటుకుని కింగ్‌డమ్ ఆడాలి. సినిమా హిట్ అయ్యాక మాట్లాడాలని విజయ్ గారు వెయిట్ చేస్తున్నారు' అని నాగవంశీ అన్నారు.


Click it and Unblock the Notifications











