నవ్వులు పూయిస్తున్న ‘కొబ్బరి మట్ట’ ప్రోమో సాంగ్!
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా 'కొబ్బరిమట్ట' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేశారు. సెప్టెంబర్ 21న నుండి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి.

హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కొబ్బరి ఆకుల సాంగ్ విడుదల చేశారు. 'కొబ్బరి ఆకులు కలగలిపే కొబ్బరిమట్ట కథ' అంటూ సాగే ఈ సాంగ్ సంపూ స్టైల్ కామెడీతో నవ్వులు పూయిస్తోంది. మన కుటుంబాన్ని విడదీసేది బ్రష్ అయినా సరే మనకు వద్దురా అంటూ ఐదురుగు అన్నదమ్ములు ఒకే బ్రష్‌తో పళ్లు తోముకోవడం లాంటి సన్నివేశాలు చూస్తుంటే ఈ మూవీ అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు మూడు పాత్రల్లో కనిపించబోతున్నారని, పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు పాత్రల్లో సంపూ కనిపించబోతున్నారని గతంలోనే పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్లు విడుదల చేశారు. మరి ఇపుడు విడుదలైన కొబ్బరి ఆకుల సాంగ్ చూస్తే పూర్తి భిన్నంగా ఉంది. అసలు సంపూ ఈ మూవీలో ఎలాంటి కథ చూపించబోతున్నారో చూడాలి.
ఈ చిత్రానికి నిర్మాత: ఆది కుంభగిరి, కథ-స్క్రీన్ ప్లే, మాటలు: స్టీవెన్ శంకర్, కూర్పు : కార్తీక శ్రీనివాస్, స్టంట్స్: జాషువ, సంగీతం: కమ్రన్, లైన్ ప్రొడ్యూసర్: సురేష్, దర్శకత్వం: రూపక్ రొనాల్డ్ సన్.


Click it and Unblock the Notifications











