కొబ్బరిమట్ట: సంపూర్ణేష్ బాబు వరల్డ్ రికార్డ్ సింగిల్ టేక్ డైలాగ్ కేక!
ఎవరిని చూడాలంటే మీ నవరంద్రాలు కళ్లుగా మారాలో.. వాడురా బోసుగాడు. చెప్పి వచ్చే తుఫాను కాదువాడు, వచ్చాక చెప్పుకునే సునామీ.. వాడే ఆండ్రాయుడు అంటూ సంపూర్ణేష్ బాబు నటించిన 'కొబ్బరి మట్ట' మూవీ కొత్త ట్రైలర్ రిలీజైంది.
ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా 3.27 నిమిషాల సింగిల్ షాట్ డైలాగ్ ఈ సినిమాలో చెప్పారు సంపూ. ట్రైలర్లో ఈ డైలాగ్ కేక పుట్టించే విధంగా ఉంది. కొణిదెల, నందమూరి, అక్కినేని, ఘట్టమనేని, మంచు, దగ్గుబాటి వంశీయులు ఏలే ఈ సినిమా సామ్రాజ్యంలో నూతన వారసుడి అంటూ సాగే ఈ లాంగ్ డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇందులో సంపూర్ణేష్ బాబు... షకీలా కుమారుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

'హృదయ కాలేయం' సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'తో ప్రేక్షకులపై వినోదాత్మక దాడి చేయబోతున్నాడు. ఈ సినిమాలో సంపూ త్రిపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం. రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహిస్తున్నారు. నీలం సాయి రాజేష్ నిర్మాత.
ఈ చిత్రంలో సంపూ.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్ ఇలా మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా విడుదలవ్వగా మంచి స్పందన వచ్చింది. ఆగస్టు 10న ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన నైజాం హక్కులు, ఓవర్సీ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయినట్టు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా హక్కులను 'నో బారియర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' సంస్థ ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది.


Click it and Unblock the Notifications











