Pawan Kalyan : క్షమించండి సార్.. పవన్ కళ్యాణ్‌తో వివాదానికి హీరో కార్తీ ఫుల్‌స్టాప్ !
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లుగా వార్తలు రావడం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. లడ్డూల తయారీకి వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిసి ఉండొచ్చని గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ) అనుమానం వ్యక్తం చేసింది. కలలో కూడా ఊహించని ఈ ఘటన ఏపీ డిప్యూటీ సీఎం, సినీనటుడు పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారు. కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీవారి విషయంలో అపచారం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ట్విట్టర్‌లో ఓ హిందూ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పవన్ బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ధార్మిక పద్ధతులు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. ఆ వెంటనే తిరుమల లడ్డూ ప్రసాదంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా పవన్ 11 రోజుల దీక్షను ప్రారంభించారు. అక్టోబర్ 2న ఉదయం శ్రీవారిని దర్శించుకుని ఆ వెంటనే దీక్ష విరమించనున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మంగళవారం మరో కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. మెట్లను స్వయంగా కడిగిన పవన్.. పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టారు.

తిరుమల లడ్డూ వివాదంపై రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ నటుడు కార్తీ తన లేటెస్ట్ మూవీ సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తిరుమల లడ్డూపై కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కావాలా నాయనా అని యాంకర్ అడగ్గా.. ఇప్పుడు లడ్డు గురించి వద్దమ్మా, ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్, నాకు లడ్డూ వద్దు అని సెటైరికల్‌గా సమాధానం చెప్పాడు. ఈ వీడియో కాస్తా వైరల్ కాగా. . పవన్ దృష్టికి వచ్చింది. విజయవాడలో డిప్యూటీ సీఎం ఈ విషయంపై స్పందించారు.
నిన్న ఓ ఫంక్షన్‌లో లడ్డు సెన్సిటివ్ మేటర్ అని ఓ వ్యక్తి జోకులు వేశాడని.. సినిమా మనిషిగా నాకు కళాకారులంటే గౌరవమని, సనాతన ధర్మాన్ని గౌరవించాలని, అలాంటివి మాట్లాడొద్దని హితవు పలికారు. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచించాలని జనసేనాని సూచించారు. దీంతో పవన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది కార్తీ వరకు వెళ్లగా.. ఆయన తాజా ఇన్సిడెంట్ గురించి మాట్లాడారు.
Dear @PawanKalyan sir, with deep respects to you, I apologize for any unintended misunderstanding caused. As a humble devotee of Lord Venkateswara, I always hold our traditions dear. Best regards.
— Karthi (@Karthi_Offl) September 24, 2024
మీరంటే నాకు ఎంతో గౌరవం సార్.. అనుకోకుండా మాట్లాడిన మాటల్లో ఇలాంటి అపార్ధం చోటు చేసుకుందని కార్తీ వివరణ ఇచ్చారు. ఈ విషయంలో తనను గౌరవించాలని.. తాను కూడా శ్రీవారి భక్తుడినే అని.. ఎప్పుడూ మన సాంప్రదాయాలను గౌరవిస్తానని కార్తీ ట్వీట్ చేశారు. అయితే ఈ ఇష్యూలో కార్తీ చాలా తెలివిగా వ్యవహరించాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. త్వరలో ఆయన సినిమా రిలీజ్ ఉండగా.. ఇలాంటి టైంలో తెలుగు ప్రజలు నొచ్చుకునే విధంగా మాట్లాడితే అసలుకే మోసం వస్తుందవని గ్రహించిన కార్తీ.. ఈ వివాదానికి ఓ చిన్న ట్వీట్‌తో సింపుల్‌గా చెక్ పెట్టేశాడు. ప్రస్తుతం కార్తీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











