తెలుగు తెరని నవ్వుల్లో ముంచిన కోట శ్రీనివాసరావు - బాబు మోహన్ జోడీ.. పొట్ట చెక్కలవ్వాల్సిందే!
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణంతో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన కోట శ్రీనివాసరావులో తిరుగులేని హాస్యనటుడు ఉన్నారు. ఆయన డైలాగ్ డెలివరి, మేనరిజంతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. అలాంటి కోటకు మరో కమెడియన్ బాబూమోహన్ తోడైతే ఇంకేముంది.. నిప్పుకు వాయువు తోడైనట్లే. తెరపై వీరు రెచ్చిపోవడంతో థియేటర్లలో జనం కేరింతలు కొట్టవారు. కేవలం ఈ జోడీని చూసేందుకే జనం థియేటర్లకు వెళ్లేవారంటే అతిశయోక్తి కాదు. కొన్నేళ్లపాటు కోట శ్రీనివాసరావు- బాబు మోహన్ జంట హవా చూపించింది.
వెండితెరపై ఎవర్‌గ్రీన్ కాంబో
కోట శ్రీనివాసరావు - బాబు మోహన్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం బొబ్బిలి రాజా. ఈ సినిమాలో వీరి కామెడీకి ప్రేక్షకులు ఫిదా కావడంతో ఎస్వీ కృష్ణారెడ్డి, ఈవీవీ సత్యనారాయణ తదితర దర్శకులు ఈ కాంబినేషన్‌ను రిపీట్ చేశారు. వీరిద్దరి కోసమే రచయితలు సీన్లు రాసేవారు. ఆ తర్వాత అల్లరి అల్లుడు, సీతారత్నం గారి అబ్బాయి, చినరాయుడు, నెంబర్ వన్, మాయలోడు, జంబలికిడిపంబ, ఏవండి ఆవిడ వచ్చింది సహా పదుల సంఖ్యలో కలిసి నటించారు. చాలా చిత్రాల్లో కోటకు అసిస్టెంట్‌గా, కొడుకుగా, కనిపించి నవ్వించారు బాబు మోహన్. వీరిద్దరూ కలిసి చేసిన సినిమాల తాలూకా క్లిప్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఒకరు మంత్రి, మరొకరు ఎమ్మెల్యే
కోట శ్రీనివాసరావు - బాబు మోహన్ మధ్య దాదాపు పదేళ్లకు పైగా వయసు అంతరం ఉన్నప్పటికీ ప్రాణ స్నేహితుల్లా, అన్నదమ్ముల్లా మెలిగారు. వీరిద్దరి జీవితంలో కొన్ని సారుప్యతలు ఉన్నాయి. రాజకీయాల్లోకి ప్రవేశించి ఇద్దరూ ఎమ్మెల్యేలు అయ్యారు. కాకపోతే బాబు మోహన్‌కి అదృష్టం కలిసొచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. అయితే కేవలం గన్‌మెన్‌ల కోసమే కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయ్యారని ఓ సందర్భంలో బాబు మోహన్ తెలిపారు. తొలుత టీడీపీ నుంచి తాను ఎమ్మెల్యేగా గెలిచి షూటింగ్‌కు గన్‌మెన్‌లతో వచ్చేవాడినని చెప్పారు. అది చూసి తట్టుకోలేకపోయిన కోట.. వెంటనే బీజేపీలో చేరి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినట్లు బాబు మోహన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మాక్కూడా గన్‌మెన్లు ఉన్నారని చెప్పేవాడని తెలిపారు.
రాజకీయాలను వదిలేసిన కోట
అసెంబ్లీలో ఇద్దరం పక్కపక్కనే కూర్చొనేవాళ్లమని రెండేళ్ల తర్వాత నేను మంత్రిని కావడంతో సీటింగ్ మారిందని.. తాను ఫ్రంట్ రో , కోటన్న బ్యాక్ రో లో కూర్చోనేవాళ్లమని బాబు మోహన్ గుర్తుచేసుకున్నారు. మంత్రివి అయినా నా పక్కనే కూర్చోవాలని మారాం చేసేవాడని.. నా హవా చూసి తట్టుకోలేక మంత్రి పదవిని వదిలేయమని చెప్పేవాడని బాబుమోహన్ అన్నారు. తనకు మంత్రయ్యే యోగం లేకపోవడంతో అసెంబ్లీకి రావడం మానేశాడని.. తర్వాత రాజకీయాలకే దూరమయ్యారని తెలిపారు.
కొడుకులను కోల్పోయిన కోట- బాబు మోహన్
వ్యక్తిగత జీవితంలోనూ వీరిద్దరికి దురదృష్టవశాత్తూ ఒకేలా జరిగింది. బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కుమారులిద్దరూ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కోటకి ఒక్కగానొక్క కొడుకు వెంకట అంజనేయ ప్రసాద్. ఇతను పలు చిత్రాల్లో నటించారు. 2010 జూన్ 20న హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రసాద్ దుర్మరణం పాలయ్యారు. కొడుకు మరణంతో కోట బాగా కృంగిపోయారు. అటు బాబు మోహన్ కుమారుడు.. ఓ పాపను తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దాంతో కొడుకు పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేసి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలా వీరిద్దరి జీవితంలోనూ విషాదం కూడా ఒకేలా ఉండటం దురదృష్టకరం. ఏళ్లుగా తన కష్ట సుఖాల్లో తోడుగా నిలిచిన మిత్రుడి మరణంతో బాబు మోహన్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











