ఇద్దరం ఒకేసారి సినిమాల్లోకి.. కోట మరణంపై చిరంజీవి ఎమోషనల్.. బాబు, కేసీఆర్, పవన్ సంతాపం
లెజండరీ యాక్టర్, మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. నాలుగు దశాబ్ధాల తన నట జీవితంలో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి తెలుగువారిని అలరించారు. అన్నగా, ఫ్రెండ్‌గా, తండ్రిగా, తాతగా, మావయ్యగా ఎన్నో పాత్రల్లో నవ్వించి, ఏడిపించిన నటుడిగా నిలిచిపోయారు కోట శ్రీనివాసరావు. హాస్యంతో ఎంతగా నవ్వించారో, విలన్‌గా తన క్రూరత్వంతో భయపెట్టారు కోట. కొన్నేళ్ల పాటు కోట శ్రీనివాసరావు లేకుండా సినిమాలు విడుదల కాలేదంటే టాలీవుడ్‌పై ఆయన ముద్రను అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 750కిపైగా సినిమాలలో నటించిన ఆయన జూలై 13న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కోట మరణంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
కోట శ్రీనివాసరావుమరణం బాధాకరమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కోట భౌతికకాయాన్ని సందర్శించిన ఆయన నివాళులర్పించారు. నాలుగు దశాబ్ధాల పాటు సినీ, నాటక రంగాలకు కోట శ్రీనివాసరావు చేసిన కళా సేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయమన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సేవ చేశారని గుర్తుచేసుకున్నారు చంద్రబాబు.

విలక్షణ నటనతో కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటని, కోట కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కోట శ్రీనివాసరావు మరణంతో సినీరంగం ఓ గొప్ప నటుడిని కోల్పోయిందన్నారు తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. విభిన్న పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారని, కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
నేను, కోట శ్రీనివాసరావు ఒకేసారి సినిమా కెరీర్‌ను ప్రారంభించామని మెగాస్టార్ చిరంజీవి గుర్తుచేసుకున్నారు. కోట లేరనే వార్త ఎంతో కలచివేసిందని.. ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలితో పోషించారని చిరంజీవి ప్రశంసించారు. కామెడీ, విలన్, సపోర్టింగ్ రోల్.. పాత్ర ఏదైనా తాను మాత్రమే చేయగలడన్న గొప్పగా నటించారని మెగాస్టార్ తెలిపారు. ఇటీవల ఆయన కుటుంబంలో జరిగిన విషాదం.. కోట శ్రీనివాసరావును మరింత కుంగదీసిందని చిరు ఆవేదన వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు మరణం చిత్ర పరిశ్రమకు, సినీ ప్రేమికులకు తీరని లోటన్నారు.
కోట శ్రీనివాసరావు గారు... ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం.ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు అన్నారు జూనియర్ ఎన్టీఆర్. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు తారక్. సినీరంగంలోని అతికొద్దిమంది గొప్పనటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. కోట శ్రీనివాసరావు గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లినా ఆయన పాత్రలు బతికే ఉంటాయని ఆర్జీవీ పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావును చూస్తూ ఆరాధిస్తూ పెరిగానని హీరో రవితేజ అన్నారు. కోటతో కలిసి పనిచేసిన క్షణాలు, మధుర జ్ఞాపకాలని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రవితేజ తెలిపారు.


Click it and Unblock the Notifications











