హీరోగా రమ్యకృష్ణ కొడుకు ? వారసుడు ఏంట్రీపై కృష్ణవంశీ ప్లానింగ్..
టాలీవుడ్‌లో స్టార్ సెలబ్రిటీల తన పిల్లల విషయంలో ఎప్పుడూ ఆసక్తి ఎక్కువే. ఏ హీరో లేదా దర్శకుడి కొడుకు ఫోటో ఒక్కసారి సోషల్ మీడియాలో కనిపించిందంటే.. వెంటనే 'సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు' అన్న వార్తలు పుట్టుకొస్తుంటాయి. ఇదే కోవలో దర్శకుడు కృష్ణవంశీ- నటి రమ్యకృష్ణల కుమారుడు రిత్విక్ వంశీ ఎంట్రీపై రూమర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో తెరపైకి రానున్నాడంటూ ఇటీవల సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో పలు పాడ్‌కాస్ట్ షోలు, ఇంటర్వ్యూలలో కృష్ణవంశీకి "మీ కొడుకును సినిమాల్లోకి ఎప్పుడు తీసుకొస్తున్నారు?" అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన చాలా క్లియర్‌గా సమాధానం చెప్పారు.
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కుటుంబం, కుమారుడి భవిష్యత్, అలాగే ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని ట్రెండ్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన భార్య, అగ్ర నటి రమ్యకృష్ణ తో విడిపోయారన్న పుకార్లపై క్లారిటీ ఇస్తూ... అవన్నీ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.

డివోర్స్ రూమర్స్ విని మేం నవ్వుకున్నాం
ఇటీవల సోషల్ మీడియాలో తమిద్దరూ విడిపోయారని ప్రచారం జరగడంపై స్పందించిన కృష్ణవంశీ... 'ఆ వార్తలు చూసి మేం ఇద్దరం పగలబడి నవ్వుకున్నాం. రమ్య చెన్నైలో ఉంటారు, నేను హైదరాబాద్‌లో ఉంటాను. అదే కారణంగా ఇలాంటి అపోహలు పుట్టాయి. ఖాళీ దొరికితే నేను చెన్నైకి వెళ్తాను... లేదంటే ఆమె హైదరాబాద్ వస్తారు' అని చెప్పారు. ఇద్దరం పబ్లిక్ పర్సన్స్ కాదని, అందుకే కలిసి ఎక్కువగా బహిరంగ కార్యక్రమాలకు వెళ్లమని వివరించారు. స్నేహితుల ఇళ్లకు, ప్రైవేట్ గెట్‌టుగెదర్‌లకు వెళ్తామే తప్ప.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టమని, తమ వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ చేయాలనుకోమని స్పష్టం చేశారు. రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. 'ఆమె నిజంగా డివైన్ చైల్డ్. తన తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది' అంటూ భార్యపై ప్రశంసలు కురిపించారు.
కుమారుడు రిత్విక్ గురించి క్లారిటీ
తమ కుమారుడు సినిమాల్లోకి వస్తున్నాడన్న ప్రచారంపై కూడా కృష్ణవంశీ స్పందించారు. ప్రస్తుతం రిత్విక్ లండన్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడని తెలిపారు. సినిమాలపై ఇప్పటికి అతనికి పెద్దగా ఆసక్తి లేదని, అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని అన్నారు. 'నా కొడుకు చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడతాడు. నాకంటే రమ్య తెలివితేటలు ఎక్కువ వచ్చాయేమో!'అంటూ సరదాగా చెప్పారు. తల్లిదండ్రులను బాగా అర్థం చేసుకుంటాడని, తమతో ఎంతో చక్కగా ప్రవర్తిస్తాడని చెప్పుతూ... కొడుకుపై గర్వం వ్యక్తం చేశారు.
డివోర్స్ రూమర్స్‌కు చెక్ పెట్టడంతో పాటు, కుమారుడి భవిష్యత్‌పై స్పష్టత ఇవ్వడం, అలాగే పెళ్లి వ్యవస్థపై తన అభిప్రాయాన్ని బలంగా చెప్పడం ఈ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ చాలా ఓపెన్‌గా మాట్లాడారు. రమ్యకృష్ణతో తన బంధం బలంగా ఉందని, కొడుకు జీవితాన్ని తనదైన మార్గంలో నిర్మించుకుంటున్నాడని చెప్పడం ద్వారా.. ఈ పుకార్లన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టినట్టయ్యింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











