Krishnam Raju No More: కృష్ణంరాజు ఆకస్మిక మరణం.. అంత్యక్రియలు ఎప్పుడు? ఎక్కడంటే?
ప్రముఖ నటుడు, రాజకీయ వేత్త, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు ఇకలేరు. వృద్దాప్య సంబంధిత సమస్యలతో ఆయన సెప్టెంబర్ 11వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయ వయసు 82 సంవత్సరాలు. కృష్ణంరాజు మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మూగబోయింది. సినీ తారలు, రాజకీయ నేతలు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. కృష్ణం రాజు వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

5 దశాబ్దాలకుపైగా కెరీర్
కృష్ణంరాజు అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. సినీరంగంలో రెబల్ స్టార్‌గా సుపరిచితులు. తెలుగు సినిమాల్లో రాణిస్తూనే ఆయన రాజకీయాల్లో కూడా వెలుగు వెలిగారు. బీజేపీతో అనుబంధాన్ని కృష్ణం రాజు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన 183 చిత్రాల్లో నటించారు. 1966 నుంచి ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో 5 దశాబ్దాల సుదీర్ఘమైన కెరీర్‌ను కొనసాగించారు.

మొగల్తూరులో జననం
కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణ రాజు దంపతులకు జన్మించారు. కృష్ణం రాజు తొలి వివాహం సీతాదేవీతో జరిగింది. అనారోగ్యం కారణంగా ఆమె మరణించడంతో 1996లో శ్యామలాదేవిని వివాహం చేసుకొన్నారు.

అవార్డులు, రివార్డులు
1966లో కే ప్రత్యగాత్మ దర్శకత్వంలో చిలుకా గోరింక చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన ఐదు ఫిలింఫేర్ అవార్డులు, మూడు నంది అవార్డులు అందుకొన్నారు. ఇంకా ఎన్నో సత్కారాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను నుంచి అందుకొన్నారు. గోపికృష్ణ మూవీస్ బ్యానర్‌ను స్థాపించి పలు చిత్రాలను నిర్మించారు.

చిరంజీవి, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్‌తో
తెలుగు సినిమా పరిశ్రమలో కృష్ణంరాజు అజాతశత్రువు. అగ్రతారలందరితోను ఆయన నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, చిరంజీవితో కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్‌తో కలిసి శ్రీకృష్ణావతారం చిత్రంలో నటించి పౌరాణిక పాత్రల్లోను మెప్పించారు. ప్రభాస్‌తో కలిసి మూడు చిత్రాలు రెబెల్, భిల్లా, రాధేశ్యామ్ చిత్రాల్లో నటించారు.

అంత్యక్రియలు ఎప్పుడంటే?
ఇక కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం అంటే సెప్టెంబర్ 11వ తేదీన మధ్యాహ్నం జరుగుతాయి. ఏఐజీ హాస్పిటల్ నుంచి తన నివాసానికి పార్దీవ దేహాన్ని తరలిస్తారు. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఉంచుతారు. రేపు ఉదయం హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్‌లో ఆయనకు శ్రద్దాంజలి ఘటిస్తారు. అనంతరం ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తామని కుటంబ సభ్యులు తెలిపారు.


Click it and Unblock the Notifications











