Krithi Shetty: 100 కోట్ల సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఉప్పెన బ్యూటీ.. ఈసారైనా లక్కు కలిసొచ్చేనా?
కృతి శెట్టి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. బేబమ్మగా సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకుంది. ముఖ్యంగా మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఈ బ్యూటీ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోతుందని అంతా భావించారు. మొదటి చిత్రం లాగే మిగతా చిత్రాలు కూడా హిట్టవుతాయని అనుకున్నారు.
ఆమె అందం, అభినయానికి ఫిదా అయిపోయిన సినీ దర్శకులు కూడా ఈమెకు వరుసగా ఛాన్సులు ఇచ్చారు. ముఖ్యంగా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ వరుసగా ఈమె సినిమాలు ఫ్లాప్ లుగా నిలవడం, పెద్దగా హిట్టు టాక్ తెచ్చుకోకపోవడంతో ప్రస్తుతం ఖాళీగా ఉంటోంది. చేయి వరకూ వచ్చిన కొన్ని పెద్ద హీరోల సినిమాలు కూడా చేజారిపోయాయి. ఇదంతా ఇలా ఉండగా... ఈ ముద్దుగుమ్మ హీరో సూర్య పక్కన తమిళ సినిమాలో ఛాన్స్ వచ్చిన నో చెప్పింది. కారణం ఏంటో తెలియకపోయినా అద్భుతమైన అవకాశాన్ని మాత్రం చేజార్చుకుంది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి ఓ అద్భుతమైన తమిళ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. 100 కోట్ల రూపాయలతో తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో కృతి శెట్టికి ఆఫర్ రావడం నిజంగా ఆమెకు అదృష్టం అనే చెప్పాలి. అయితే జయం రవి హీరోగా తెరకెక్కబోతున్న జీనీ అనే సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. ఈమె మాత్రమే కాదండోయ్.. మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ చిత్రంలో అవకాశం దక్కించుకున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ వామికా గబ్బితో పాటు కల్యాణి ప్రియదర్శి కూడా ఈ సినిమాలో నటించబోతుందట.
అయితే జీనీ సినిమాలో కృతి శెట్టి నటించబోతున్నట్లు తెలిసినప్పటికీ... ఆమెకు ఎలాంటి పాత్ర దక్కిందో, ఏ క్యారెక్టర్ లో కనిపించబోతుందనేది మాత్రం తెలియట్లేదు. భువనేష్ అర్జునన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఇశారి కె.గణేష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే మహేష్ ముత్తుస్వామి సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహిస్తుండగా... ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్ పనులు చూసుకుంటున్నారు.

అలాగే లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అదిస్తుండగా.. వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలోనే ఈ చిత్రం తెరకెక్కుతున్నప్పటికీ.. పాన్ ఇండియా సినిమాగా మలవబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వరుస ఫ్లాపులతో కష్టాల్లో ఉన్న కృతి శెట్టి.. ఈ సినిమాతోనే హిట్ ట్రాక్ లో పడుతుందో లేదో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











