వాళ్లకేమో కోట్లు.. మనకేమో పోట్లు.. కుబేర హిట్‌తో తమిళ డైరెక్టర్స్‌పై అలాంటి ట్రోలింగ్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటించిన చిత్రం కుబేర. జూన్ 20న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమాలు లేక థియేటర్లు మూతబడుతున్న వేళ ఆ చిత్రం వాటికి ఆక్సిజన్‌లా మారింది. చాలా రోజుల తర్వాత థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు పడటంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సంతోషంగా ఉన్నారు. కుబేర టాక్ తెలిసిన వెంటనే టికెట్లు ఫాస్ట్ ఫిల్లింగ్ అయ్యాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ కుబేరకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఉండగా.. కోలీవుడ్ దర్శకుల మీద దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
ధనుష్‌కు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్
తెలుగు దర్శకులను ఎంచుకుని తమిళ, మలయాళ హీరోలు హిట్లు కొడుతున్నారు. కుబేరకు ముందు ధనుష్ తన తొలి స్ట్రెయిట్ తెలుగు చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేశారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ఇదే వెంకీ అట్లూరి దర్శకత్వంలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సైతం హిట్‌గా నిలిచింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా భారీ విజయం సాధించి.. దుల్కర్‌కు తెలుగునాట ఫాలోయింగ్‌ను తీసుకురావడంతో పాటు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మీనాక్షి చౌదరిని కెరీర్‌లో నిలబడేలా చేసింది.

దళపతిని స్టైలీష్‌గా చూపించిన వంశీ పైడిపల్లి
వీరి కంటే ముందే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున నటించిన ఊపిరి సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇందులో తమిళ హీరో కార్తీ నటించగా.. ఆయనకు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఊపిరి విజయం సాధించడంలో కార్తీ కూడా కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత ఏకంగా కోలీవుడ్ సూపర్‌స్టార్, ఇళయ దళపతి విజయ్‌తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు వంశీ పైడిపల్లి. ఆయన దర్శకత్వంలో విజయ్ నటించిన వారిసు మంచి హిట్ సాధించడంతో పాటు ఆయనను స్టైలీష్‌గా ప్రెజెంట్ చేసి దళపతి అభిమానులను ఖుషీ చేశారు. టాలీవుడ్ దర్శకుల సత్తాను గమనించిన కోలీవుడ్ హీరోలు.. తెలుగు డైరెక్టర్స్‌తో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం సూర్య తన 46వ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నారు.
చరణ్‌కు డిజాస్టర్ ఇచ్చిన శంకర్
తెలుగు దర్శకులు తమిళ హీరోలకు సూపర్ హిట్స్ కోట్ల రూపాయలు కలెక్షన్స్ తెచ్చిపెడితే.. తమిళ దర్శకులను నమ్మిన తెలుగు హీరోలకు అరవ డైరెక్టులు మామూలు షాకులివ్వలేదు. ఈ ఏడాది సంక్రాంతికి తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌గా నిలిచి నిర్మాతలకు కోట్లలో నష్టం తెచ్చిపెట్టింది. అంతకుముందు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య నటించిన కస్టడీ అక్కినేని అభిమానులకు షాకిచ్చింది. ఇక సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. ఏఆర్ మురగదాస్ కాంబోలో వచ్చిన స్పైడర్ చిత్రం గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. కనీసం ప్రిన్స్ అభిమానులను కూడా మెప్పించలేని స్పైడర్.. మహేశ్ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచింది. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని చేసిన వారియర్.. ఎనర్జిటిక్ స్టార్ కెరీర్‌ను మరింత దెబ్బతీసింది.
తమిళ దర్శకులపై ట్రోలింగ్
ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు తెలుగు హీరోలను తమిళ దర్శకులు ముంచేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. బాహుబలి, పుష్ప 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో టాలీవుడ్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. దీంతో ప్రతి పెద్ద సినిమా విడుదల సమయంలో తెలుగు, తమిళ ప్రేక్షకులు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కుబేర చిత్రంతో ఓ తెలుగు దర్శకుడు హిట్ కొట్టడంతో .. టాలీవుడ్ డైరెక్టర్లను చూసి సినిమా ఎలా తీయాలో నేర్చుకోవాలంటూ తెలుగు ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











