కన్నడిగుల్ని కెలికిన రష్మిక.. చిక్కుల్లో కుబేర?
కన్నడ భాష గురించి దిగ్గజ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాను తప్పు చేయలేదని క్షమాపణలు చెప్పనని కమల్ మొండికేయడం ఆయన నటించిన థగ్‌లైఫ్ చిత్రాన్ని చిక్కుల్లో పడింది. ఏకంగా కోర్ట్ వరకు ఈ వ్యవహారం వెళ్లగా సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేసే అవకాశం దక్కలేదు. దీంతో థగ్‌లైఫ్‌కు భారీ నష్టాలు వచ్చాయి. డివైడ్ టాక్‌తో డిజాస్టర్‌గా నిలిచిన థగ్‌లైఫ్‌కు కర్ణాటకలో సినిమా రిలీజ్ చేయకపోవడం మరింత దెబ్బకొట్టింది. ఆ ఏరియాలో సినిమా విడుదలై ఉంటే కొద్దోగొప్పో ఉపశమనం దక్కేది. కమల్ హాసన్‌నే మూడు చెరువుల నీళ్లు తాగించిన కన్నడిగులను భాష విషయంగా మరోసారి కెలికింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ వివరాల్లోకి వెళితే..
నాగార్జున- ధనుష్‌ల కాంబోలో కుబేర
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం కుబేర. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శేఖర్ కమ్ముల, సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావులు సంయుక్తంగా దాదాపు రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నాగార్జున చాలా రోజుల తర్వాత నటిస్తుండటం ఇందులో ధనుష్ హీరో కావడంతో కుబేరపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకున్నాయి.
ప్రమోషన్ కార్యక్రమాల్లో కుబేర యూనిట్
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించారు. బాలీవుడ్ నటులు దలీప్ తాహిల్, సయాజీ షిండే, జిబ్ సరబ్, దివ్య డెకాటే, కౌశిక్ మహత, హరీష్ పేరడి తదితరులు నటిస్తున్నారు. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 వేల థియేటర్‌లలో కుబేర సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున, ధనుష్, రష్మిక సహా చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషనల్ కార్యక్రమాల్లో తీరిక లేకుండా పాల్గొంటోంది.

నా మొదటి భాష తమిళమే
తాజాగా చెన్నైలో కుబేర మెగా ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రష్మిక పాల్గొన్నారు. ఇళయ దళపతి విజయ్ సరసన వారిసులో నటించిన రష్మిక చాలాకాలం తర్వాత చెన్నై వాసులను పలకరించారు. ఈ కార్యక్రమంలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. చెన్నైలోనే తన బాల్యం గడిచిందని.. అందుకే ఈ నగరానికి తన హృదయంలో ప్రత్యేక స్థానముందని రాసుకొచ్చింది. తన తండ్రి ఉద్యోగ రీత్యా తాము చెన్నైలోనే నివసించామని.. ఇక్కడి ఓ స్కూల్‌లో చదువుకున్నానని, ఆ తర్వాతే తాము కూర్గ్‌కు మకాం మార్చామని తెలిపింది. ఒకరకంగా తాను నేర్చుకున్న మొదటి భాష తమిళమేనని రష్మిక పేర్కొంది.
రష్మికపై రగిలిపోతోన్న కన్నడిగులు
మొదట నేర్చుకున్న భాష తమిళం అని చెప్పడంతో రష్మికపై కన్నడిగులు మండిపడుతున్నారు. విరాజ్‌పేటలో పుట్టిన నువ్వు.. గొనికొప్పల్‌లోని కూర్గ్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న నువ్వు మొదట నేర్చుకున్న భాష తమిళమా? అంటూ మండిపడుతున్నారు. కన్నడ భాష గురించి కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో థగ్‌లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో బ్యాన్ చేయగా.. ఇప్పుడు రష్మిక వ్యాఖ్యలతో ఆమె నటించిన కుబేర విడుదలకు ఇబ్బందులు ఎదురవుతాయా? అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి దీనిపై రష్మిక ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











